Pakistan Team| | ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచ కప్ భారత్ వేదికగా జరుగుతున్న విషయం విదితమే. నిన్న చెన్నై వేదికగా జరిగిన టోర్నీలో ఆప్ఘనిస్థాన్ చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవి చూసింది. ఇండియాతో మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన పాక్, తాజాగా ఆప్ఘన్ చేతిలో ఓడిపోయి మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సెమీస్ చేసే అవకాశాలను పాకిస్తాన్ సంక్లిష్టం చేసుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రస్తుత జట్టుపై మండిపడ్డారు.ఆప్ఘన్ చేతిలో పాక్ ఓటమి చెందడం చాలా అవమానకరం అని వసీం అక్రమ్ పేర్కొన్నారు. కేవలం రెండు వికెట్లు.. 280-290 పెద్ద స్కోరేమీ కాదు. పిచ్ సంగతి పక్కన పెడితే పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూస్తేనే తెలిసిపోతుంది.. వాళ్ల ఫిట్‌నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో. గత రెండు సంవత్సరాలుగా క్రీడాకారుల్లో ఫిట్‌నెస్ లెవల్స్ తగ్గినట్లు మ్యాచ్ సందర్భంగా మేము చాలాసార్లు చర్చించుకున్నాము. నేను ఆటగాళ్ల పేర్లు ప్రస్తావిస్తే వ్యక్తిగతంగా వారికి నచ్చదు. వాళ్లు రోజుకు 8 కిలోల చొప్పున మటన్ తింటున్నట్టు తెలిసిందని అక్రమ్ ఘాటుగా స్పందించారు. వృత్తిపరంగా వాళ్లు దేశం కోసం ఆడుతున్నారని.. ఇందుకోసం పారితోషికం కూడా తీసుకుంటున్నారు అంటూ విరుచుకుపడ్డారు. వసీం వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
నిన్న చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. తొలుత పాకిస్థాన్ భారీగానే పరుగులు చేసినా.. తదుపరి బ్యాటింగ్ కు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్‌ను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలం అయ్యారు.