Site icon vidhaatha

SLBC టన్నెల్‌లో.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలి: సీఎం రేవంత్ రెడ్డి

SLBC Tunnel Rescue Operation: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మరణించిన ఏడుగురు కార్మికుల మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలా వద్దా అన్న దానిపై సహాయక చర్యలలో పాల్గొన్న అధికారులు, రెస్క్యూ బృందాల ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. టన్నెల్ లో సహాయక చర్యలను కొనసాగించాలని నిర్ణయించారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని నియమించాలని సీఎస్ ను రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ కు సూచించారు.

ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్స్ పర్ట్ కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ లో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్పీ, ఎస్ఎల్బీసీ అధికారులు,ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, సింగరేణి, ఆర్మీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు అధికారులకు, సిబ్బందికి సవాలుగా మారింది. ప్రమాదం జరిగి సోమవారంతో 31రోజులైనా టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఏడుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదంలో 8మంది గల్లంతవ్వగా ఇప్పటిదాకా గుర్‌ప్రీత్‌సింగ్‌ మృతదేహం మాత్రమే బయటకు తీసుకరాగలిగారు. ప్రస్తుతం ర్యాట్ హోల్ మైనర్స్ , జేసీబీలు, రోబోలు, డాగ్ స్క్వాడ్, దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు 1000 మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినప్పటికీ పురోగతి కనిపించడం లేదు. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాల తొలగింపులు రెస్క్యూ సిబ్బందికి సవాల్ గా మారాయి. డీ1 వద్ద తవ్వకాలు కొనసాగించాలంటే మళ్లీ పై కప్పులు కూలుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. అయితే  సీఎం ఆదేశాలతో తిరిగి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగనుండటం మరింత ఉత్కంఠగా మారింది.

Exit mobile version