Site icon vidhaatha

Neoliberal Economy | నయా ఉదారవాద విధానాలు మేలు చేసిందెవరికి? ఖుల్లం ఖుల్లా తేల్చేసిన నివేదిక

Neoliberal Economy | భారతదేశంలో సరళీకరణ విధానాలు అమలు చేసి ఇప్పటికి సుమారు 35 సంవత్సరాలు కావస్తున్నది. దేశ ఆర్థిక స్థితిని, గతిని మార్చవేస్తాయని, దేశానికి కొత్త దశ, దిశ నిర్దేశిస్తాయని పాలకులు చెబుతూ నూతన ఆర్థిక విధానాలను దేశంలో ప్రవేశపెట్టారు. అప్పట్లోనే వామపక్షాలు, ఇతర ప్రగతిశీల శక్తులు, బుద్ధిజీవులు ఇవి దేశ పేద, మధ్యతరగతి ప్రజలకు గుది బండలుగా మారుతాయని, వారి జీవితాలను మరింత దిగజారుస్తాయని ఘోషించారు. అటువంటివారిని దేశ ద్రోహులుగా, అభివృద్ధి నిరోధకులుగా పాలకులు ముద్ర వేస్తూ వచ్చారు. కానీ.. ఇన్నేళ్ల తర్వాత ఒక్కసారి నిలబడి ఏం జరుగుతున్నదో గమనిస్తే.. నాటి ఆందోళనలు వాస్తవరూపాలు దాల్చి.. నేడు కండ్ల ముందు కదలాడుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక సమగ్ర కథనాన్ని హిందూస్తాన్‌ టైమ్స్‌ ప్రచురించింది. ఇందులో విస్తుబోయే వాస్తవాలను ముందు ఉంచింది.

దేశంలో నయా ఉదారవాద విధానాలను తీసుకొచ్చిన 35 ఏళ్ల తర్వాత అవి కుబేరలకు, అత్యంత సంపన్నులకే మేలు చేశాయి తప్ప పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. దేశ సంపదలో 29 శాతాన్ని అగ్రస్థానాల్లో ఉన్న 0.1శాతం మంది కలిగి ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. అంతకు ముందు 1961 లెక్కల ప్రకారం.. ఇటువంటి అత్యంత సంపన్నుల చేతిలో ఉన్న దేశ సంపద 3.2 శాతం మాత్రమే. కానీ.. ఇన్నేళ్లలో వారి సంపద అనూహ్యంగా పెరిగిపోయిన వాస్తవాన్ని నివేదిక కళ్లకు కట్టింది. మరోవైపు కింద భాగంలో ఉన్న 50 శాతం మంది చేతిలో కేవలం 6.5శాతం సంపద ఉన్నది. ఇది గతంలో 11.4 శాతం ఉండగా ఇప్పుడు ఇలా తయారైందని వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ 2024 నివేదిక తేల్చి చెప్పింది.

నయా ఉదారవాద విధానాలు సంపన్న వర్గానికి మాత్రమే మేలు చేశాయని విశదీకరించింది. మొత్తంగా 1 శాతం భారతీయుల ఇళ్లలో 39.5 శాతం సంపద మూలుగుతున్నదని తెలిపింది. అదే టాప్‌ 10%లో చూస్తే 64.5 శాతం సంపద పోగుపడింది. దిగువన ఉన్న 50 శాతం అంటే సుమారు 72 కోట్ల మంది వద్ద కేవలం 6.5 శాతం సంపద మాత్రమే ఉన్నది. మొత్తం వయోజనులు 92 కోట్ల మంది దేశంలో ఉన్నారనుకుంటే.. అందులో 92 లక్షల మంది వద్దే 29 శాతం సంపద ఉన్నది. మీకు 22 లక్షల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే.. లేదా మీరు ఏటా 2.9 లక్షలు సంపాదిస్తున్నట్టయితే.. మీరు టాప్‌ 10% సంపన్న భారతీయుల జాబితాలో ఉన్నట్టు లెక్క!

Exit mobile version