Home Loans | సొంతిల్లు అనేది ఒక కల.. సొంతింటి నిర్మాణం కోసం చాలా రకాలుగా కష్టపడి డబ్బు సంపాదిస్తుంటారు. ఆ సంపాదన కూడా సరిపోని పక్షంలో బ్యాంకులను సంప్రదిస్తుంటారు. ఇంటి డాక్యుమెంట్లను బ్యాంకులో తనఖా పెట్టి.. హోమ్ లోన్స్ తీసుకుంటుంటారు. హోమ్స్ లోన్స్ ఈఎంఐలను నెలల వారీగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద అయితే హోమ్ లోన్ తీసుకున్నామో.. ఆ వ్యక్తి పేరు మీదనే రుణం చెల్లించాలి. మరి ఆ వ్యక్తి అకాల మరణం చెందితే.. తదుపరి ఈఎంఐలు ఎవరు చెల్లించాలి అనే విషయాలు తెలుసుకుందాం..
రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత సాధారణంగా హోమ్ లోన్ కో-అప్లికెంట్ లేదా చట్టపరమైన వారసులపై ఉంటుంది. రుణానికి కో-అప్లికెంట్ ఉంటే.. వారు చెల్లింపులను కొనసాగించడానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తారు. కో-అప్లికెంట్ లేనప్పుడు.. ఈఎంఐ చెల్లింపుల కోసం చట్టపరమైన వారసులను సంప్రదించవచ్చు.
చట్టపరమైన వారసులు చెల్లించొచ్చు..
చట్టపరమైన వారసులు అంటే కుటుంబ సభ్యులు. మరణించిన వ్యక్తి నుంచి ఆస్తులతో పాటు ఆ ఇంటి బాధ్యతలను వారసత్వంగా పొందేవారే చట్టపరమైన వారసులు. కాబట్టి హోమ్ లోన్ బకాయిలను వారసులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వారసులు బకాయిలు చెల్లించడంలో విఫలమైతే.. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి, దానిని వేలం వేయడానికి బ్యాంకులకు హక్కు ఉంటుంది. ఈ ప్రక్రియ వారసులకు ఒత్తిడిని కలిగించటంతో పాటు ఆర్థికంగా భారంగా ఉంటుంది. కాబట్టి వారసులు తప్పనిసరిగా రుణం చెల్లించాల్సిందే.
కో-అప్లికెంట్ బాధ్యత..
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బతికి ఉన్న కో-అప్లికెంట్ ఈఎంఐ చెల్లింపులను కొనసాగించొచ్చు. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే.. బ్యాంకులు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గృహ రుణాన్ని తిరిగి చెల్లించడంలో కో-అప్లికెంట్లు సమాన బాధ్యతను పంచుకుంటారు.
ఇన్సూరెన్స్ పాలసీలు..
చాలా మంది రుణగ్రహీతలు సాధారణంగా హోమ్ లోన్స్ తీసుకునే సమయంలోనే ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకుంటారు. అలా పాలసీ తీసుకున్న వ్యక్తుల లోన్ మెుత్తానికి సెక్యూరిటీ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో సదరు రుణం తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే.. బకాయి ఉన్న లోన్ మొత్తాలను ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. ఇలా పాలసీ ఉన్నట్లయితే, అది చట్టపరమైన వారసులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించగలదు. ఇలాంటి సందర్భంలో బీమా కంపెనీ మిగిలిన హోమ్ లోన్ మొత్తాన్ని రుణదాతతో సెటిల్ చేసుకుంటుంది. దీనికోసం కొన్ని అవసరమైన డాక్యుమెంట్లను వారసులు లోన్ అందించిన సంస్థకు అందించాల్సి ఉంటుంది.