Oxfarm America : ప్రపంచ జనాభాలో అత్యంత ధనవంతులైన ఒక్క శాతం మంది తమ ఆదాయంలో గడిచిన దశాబ్ద కాలంలో 42 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించారని ఆక్స్‌ఫామ్ అమెరికా (Oxfarm America) తన నివేదికలో వెల్లడించింది. ఇది అట్టడుగున ఉన్న 50 శాతం జనాభా సాధించిన వృద్ధి కంటే 36 రెట్లు ఎక్కువని ఆక్స్‌ఫామ్ నివేదిక స్పష్టంచేసింది.
బ్రెజిల్ దేశంలో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి ముందు ఈ నివేదిక విడుదలైంది. గత పదేళ్ల కాలంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది ఆదాయం 4 లక్షల డాలర్లు పెరుగగా.. దిగువ శ్రేణిలో ఉన్నవారి ఆదాయం కేవలం 335 డాలర్లు (రూ. 28,054) పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
అంటే సామాన్యుల ఆదాయం రోజుకు తొమ్మిది పైసల కంటే తక్కువ మాత్రమే పెరిగింది. అదేవిధంగా బిలియనీర్లు తమ ఆదాయంలో అర శాతం కంటే తక్కువగా పన్నులు చెల్లిస్తున్నారని నివేదిక పేర్కొంది. బ్రెజిల్‌లో జరుగుతున్న జీ20 సమావేశంలో సూపర్ రిచ్‌ల పన్ను పెంపు సహా వివిధ ప్రతిపాదనలను పరిశీలించనున్నారు.