విధాత : వెండి, బంగారం ధరల (Silver, Gold Price) పోటాపోటీ పెరుగుదల మరింత జోరందుకుంది. వెండి కిలో ధర శనివారం ఒక్క రోజునే ఏకంగా రూ.20,000పెరిగి రూ.2,74,000కు చేరి మరో కొత్త రికార్డు ధర(New Rcord Price) నమోదు చేసింది. ఇదే డిసెంబర్ 18వ తేదీన 2,24,00గా ఉన్న కిలో వెండి ధర 9రోజుల వ్యవధిలోనే రూ.50,000పెరుగడం గమనార్హం. మార్కెట్ నిపుణుల అంచనాలను సైతం అధిగమించి ఈ ఏడాదిలోనే వెండి ధరలు పెరుగుతున్న తీరు కొనుగోలుదారులను, నిపుణులను సైతం అశ్చర్యపరుస్తుంది. అంతర్జాతీయంగా వెండి పెట్టుబడుల సాధనంగా వెండికి డిమాండ్ పెరగడం, పారిశ్రామిక ఉత్పత్తుల్లో వెండి వినియోగం, డిమాండ్ స్థాయిలో కొత్తగా వెండి తవ్వకాల లభ్యత లేకపోవడంతో వెండి ధరలు అంచనాలకు మించి పెరిగి పోతున్నాయి.
బంగారం ధరలు కూడా కొత్త రికార్డు
బంగారం ధరలు సైతం శనివారం మరింతగా పెరిగిపోయాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200పెరిగి రూ.1,41,220కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,100పెరిగి రూ.1,29,450కి చేరింది.
ఫెడ్ విధానాలు, డాలర్ బలహీనపడిపోతుండటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుండటంతో సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగి బంగారం, వెండి వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. మార్కెట్ నిపుణుల అంచనా మేరకు కొత్త సంవత్సరంలో బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. త్వరలోనే కిలో వెండి రూ. 3 లక్షలకు, తులం బంగారం రూ.2లక్షలకు చేరబోతుందని అంచనా వేస్తున్నారు.
