Site icon vidhaatha

Swiggy – Zomato | యూజర్లకు షాక్‌ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో..! ప్లాట్‌ఫామ్‌ ఫీజు 20శాతం మేర పెంపు..!

Swiggy – Zomato | ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటో వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ, బెంగళూరుతో పాటు పలు నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును ఇకపై రూ.6కి పెంచినట్లు పేర్కొన్నాయి. గతంలో ఈ ఫీజు రూ.5 ఉండేది. ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెంచాయి. అయితే, బెంగళూరులో ఫీజును స్విగ్గీ తొలుత రూ.7 పేర్కొనగా.. ఆ తర్వాత రాయితీ ఇచ్చి రూ.6కి తగ్గించింది. గతంలో కూడా జొమాటో స్విగ్గీలు తమ ప్లాట్‌ఫాం ఫీజును పెంచిన విషయం తెలిసిందే. 2023లో ఈ తరహా ఫీజును ప్రారంభించాయి. మొదట రూ.2గా ఉన్న ఫీజును విడుతల వారీగా పెంచుతూ వచ్చాయి.

ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచడంతో రూ.5కి చేరింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ నగరాల్లోనూ ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపును వర్తింప చేసింది. ఇక వేగవంతమైన డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరుతో ప్రత్యేకంగా ఫీజును సైతం వసూలు చేస్తున్నది. ఒక్కో ఆర్డర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్‌లు ఈ తరహా ఫీజులకు తెరలేపినట్లు తెలుస్తున్నది. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై రూ.4, ఇన్‌స్టా మార్ట్‌ రూ.5 వసూలు చేస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఛార్జీలు వరుసగా రూ.16, రూ.4గా ఉన్నాయి. మరోవైపు, కొన్ని సమయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల సర్జ్ చార్జీలు సైతం వసూలు చేస్తుండడం గమనార్హం. టాటా గ్రూప్‌నకు చెందిన బీబీనౌ రూ.99పై విలువ చేసే ఆర్డర్లపై రూ.5 హ్యాండ్లింగ్ చార్జీలు వసూలు చేస్తున్నది.

Exit mobile version