విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా అత్యధికంగా ఆన్ లైన్ సంస్థలలో ప్రజల నుంచి అత్యధిక ఆర్డర్ పొందిన ఐటమ్ గా బిర్యానీ రికార్డు సృష్టించింది. స్విగ్గీ నిమిషానికి వందల సంఖ్యలో బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. ఒక్క స్విగ్గీలోనే డిసెంబర్ 31 రోజున రాత్రి 7:30 గంటలకే రికార్డు స్థాయిలో 2,18,993 బిర్యానీలు ఆర్డర్ అవ్వడం విశేషం. ఒక్క స్విగ్గీలోనే ఇంత భారీ స్థాయిలో బిర్యానీ ఆర్డర్లు వచ్చాయంటే..మిగతా ఆన్ లైన్ సంస్థలలో ఇంకెన్ని బిర్యానీ ఆర్డర్లు వచ్చాయన్నది చూస్తే బిర్యానీపై ప్రజల మోజు అర్ధమవుతుంది. ఈ దఫా న్యూఇయర్ వేడుకల్లో కేవలం ఆహార పదార్థాలే కాకుండా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా భారీగా ఆర్డర్ చేయడం గమనార్హం.
దేశవ్యాప్తంగా ప్రజలు 2026 నూతన సంవత్సర సంబరాల్లో భాగంగా డిసెంబర్ 31 రాత్రి భారతీయులు పీక్ స్టేజ్‌లో ఫుడ్ ఆర్డర్లు చేసి రికార్డులు సృష్టించారు. ఫుడ్ ఆర్డర్లతో పాటు ఐఫోన్లను, బంగారు నాణేలను, స్మార్ట్ వాచ్‌లను కూడా ఆర్డర్ ఇచ్చారు. ఒకే రోజులో ఇన్ని రకాల విభిన్న వస్తువుల ఆర్డర్లు రావడం ఈ కామర్స్ సంస్థలను కూడా విస్మయపరిచింది. డిసెంబర్ 31 రాత్రి వేళ తమకు వచ్చిన ఆర్డర్ల గురించి స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
రాత్రి 7:30 గంటలకే రికార్డు స్థాయిలో 2,18,993 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. రాత్రి 9:30 గంటల సమయానికి 90,000 కంటే ఎక్కువ బర్గర్‌లు, 7,573 గజర్ కా హల్వా ఆర్డర్లు అందినట్లుగా స్విగ్గీ వెల్లడించింది. 4,244 మంది ఉప్మాను, బెంగళూరులో 1,927 మంది సలాడ్లను, 9,410 మంది కిచిడీని ఆర్డర్ చేశారు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి స్విగ్గీకి ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయానికే స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ సహా ముఖ్య పట్టణాల్లో ఆర్డర్లు వెల్లువెత్తాయి. కండోమ్స్, పార్టీ స్నాక్స్, కూల్ డ్రింక్స్, పూల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. డెలివరీ బాయ్స్ విరామం లేకుండా పనిచేస్తూ వేల సంఖ్యలో ఆర్డర్లను వినియోగదారులకు అందించారు.
అత్యధిక రద్దీ ఉన్న సమయాల్లో కూడా డెలివరీ ఆలస్యం కాకుండా అదనపు సిబ్బందిని రంగంలోకి దించడంతో కస్టమర్ల అవసరాలను తీర్చారు. ఈ పరిణామం సెలబ్రేషన్ల సమయంలో వినియోగదారుల అవసరాలను తీర్చడంలో.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఎంత కీలకంగా మారాయన్నదానికి నిదర్శనంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి :
New Year Drunk And Drive Cases : న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎంతమంది దొరికారో తెలుసా!
Telangana liquor sales record| న్యూ ఇయర్ దెబ్బకు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు
