విధాత : దేశీయ కార్ల మార్కెట్ లో దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ కొత్త కార్ల లాంచీంగ్ లు, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేయడంలో పోటీ పడుతున్నాయి. టాటా సియోరా అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా రికార్డు ఆర్డర్లు సాధించడంతో పాటు అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్ కోసం తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించడం కార్ల అమ్మకాల ప్రక్రియలో సంచలనం రేపింది. ఈ రికార్డును ఇప్పుడు మరో దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన.. XUV 7XO & XEV 9S కార్లు బద్దలు కొట్టాయి. ఈ కార్ల లాంచింగ్ జరిగిన తొలి రోజు నాలుగు గంటల్లో వీటి కోసం 93,689 బుకింగ్‌లు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది. ఈ బుకింగ్ విలువ రూ.20,500 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది.
మహీంద్రా దూకుడు
కొత్త మహీంద్రా XUV 7XO ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉన్నాయి. ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లు లాంచ్‌కు ముందే ముగిశాయి. కాగా కొత్త బుకింగ్‌లు జనవరి 14న ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన వేరియంట్‌ల డెలివరీలు అదే రోజున ప్రారంభమయ్యాయని, మిగిలిన వేరియంట్‌ల డెలివరీలు ఏప్రిల్ 2026లో కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. క మహీంద్రా XEV 9S విషయానికి వస్తే..దీని డెలివరీలు జనవరి 23 ప్రారంభం కానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ కారు 59 kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. దీని రేంజ్ 679 కి.మీ వరకు ఉంటుందని సమాచారం.
టాటా సియెరా డెలివరీలు ప్రారంభం
ఇకపోతే మార్కెట్ లో లాంచ్ అయి డెలివరీలు ప్రారంభమైన టాటా సియెరా కారు ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. జనవరి 15నుంచి కార్ల డెలివరీ కొనసాగుతుంది.
మారుతి సుజుకీ నుంచి విక్టోరిస్ దూకుడు
గత ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మారుతి సుజుకి విక్టోరిస్..ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి 80,000 బుకింగ్స్ అందుకుంది. కాగా అందులో 35వేలు కంటే ఎక్కువ డెలివరీలు పూర్తి చేసింది. దీని ధరలు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. చూడటానికి కొంత రాండ్ విటారా మాదిరిగా కనిపించే మారుతి సుజుకి విక్టోరిస్ కారు కూడా 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ &1.5L స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలలో అమ్మకానికి ఉంది.
అత్యధిక కార్ల అమ్మకాలలో హ్యుందాయ్ క్రేటా టాప్
2025లో హ్యుందాయ్ క్రేటా కార్లు అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీ కారుగా రికార్డు సాధించాయి సగటున రోజుకు 550 క్రెటా కార్లను హ్యుందాయ్ సంస్ధ విక్రయించడం విశేషం. క్రెటా 2,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది.మొత్తం మీద హ్యుందాయ్ క్రెటా గత ఐదు సంవత్సరాలుగా (2020–2025) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది.
ఈవీ అమ్మకాల్లో ఎంజీ విండర్స్ దే అగ్రస్థానం
2025లో భారతీయ మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా ఎంజీ విండ్సర్ రికార్డ్ సృష్టించింది.గత ఏడాది ఎంజీ విండ్సర్ కారు మొత్తం 46735 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి.. ఫోర్ వీలర్ ఈవీ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. ఎంజీ విండ్సర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ (38kWh), ఎసెన్స్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ ప్రో (52.9kWh), ఎసెన్స్ ప్రో (52.9kWh). కస్టమర్లు ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్ లేదా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్‌స్క్రిప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీని ధరలు రూ. 14.00 లక్షల నుంచి రూ. 18.31 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి.
ఇండియన్ మార్కెట్లో ఎంజీ ఈవీలకు టాటా మోటార్స్ నుంచి టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం XPRES-T ఈవీల నుంచి గట్టి పోటీ నెలకొంది. నెక్సన్ ఈవీ ఇప్పటికే లక్ష కార్లను అమ్మకాలు సాగించింది. టాటా నుంచి సియెరా EV, అప్డేటెడ్ పంచ్ EV, అవిన్యా వంటి కార్లు లాంచ్ కానున్నాయి.
ఇవి కూడా చదవండి :
Train Fare : రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
Gold Silver Prices : మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
