Praneeth Hanumanthu | ఎవరీ యూట్యూబ్​ సైకో…  ప్రణీత్​​ హనుమంతు?

 ప్రణీత్ హనుమంతు(Praneeth Hanumanthu)...  ఈమధ్య బాగా వినబడుతున్న పేరు. రోస్టింగ్​ పేరుతో యూట్యూబ్​లో దిక్కుమాలిన వీడియోలు చేస్తూ తనను తనో సెలబ్రిటీగా ఫీలవుతుంటాడు. తీరా చూస్తే ఏం ఉండదు. పనీపాటా లేకుండా యూట్యూబ్​ చానెళ్లు చూస్తుండే బేవార్స్​ బ్యాచ్​కు ఒక సోర్స్​..అంతే.

కుటుంబ అనుబంధం, ప్రేమ అంటే బహుశా తెలియని ఫ్యామిలీలో పెరగడం వల్ల సాడిజం, సైకో ప్రవృత్తి అలవాటయ్యుంటాయి. అన్నట్లు ఈయన గారి అన్న కూడా యూట్యూబరే. తను ఫ్యాషన్​ ట్రెండ్స్​పై టిప్స్​, ట్రిక్స్​ ఇస్తూ విడియోలు చేస్తుంటాడు. గత కొన్ని రోజుల క్రితం ఎవరో అమెరికా వాళ్లు షేర్​ చేసిన తండ్రీకూతుళ్ల విడియో(Father-Daughter video)పై అసభ్యంగా కారుకూతలు కూసారు ఈ రోస్టింగ్​ బ్యాచ్(Roasting Video)​. వావీవరుసలు కూడా తెలియకుండా మాట్లాడే ఇలాంటి వెధవలను కన్న తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాల్సిన విషయం ఇది. పిడోఫిలియా-Pedophilia (పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ)​ అనే ఒకరకమైన మానసిక జాఢ్యాన్ని ఆపాదిస్తూ, నీచమైన వ్యాఖ్యలు చేసారు ఆ ముగ్గురు. యూట్యూబ్(Youtube)​లో లక్షా డెబ్భైవేలు, ఇన్​స్టా(Instagram)లో 55వేలు ఖాతాదారులున్నారు. ఉంటారు కూడా.. విషయం అట్టుంటది మరి ప్రణీత్​తోని.

ఈ విడియోను మొట్టమొదటగా సభ్యసమాజం దృష్టికి తీసుకొచ్చింది సినీ హీరో సాయి ధరమ్​ తేజ్(Hero Sai Dharam Tej)​. ఆయనే దీన్ని పోలీసులకు, ముఖ్యమంత్రికి, డిజిపికి, మంత్రి సీతక్కకు ట్యాగ్​ చేసాడు. దాంతో విపరీతంగా వైరల్​ అయిన ఈ రోస్టింగ్​ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరూ ఛీత్కరించారు. మానవ సమాజంలో బతికే అర్హత ఈ ప్రణీత్​ అనే వాడికి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి(CM of Telangana) కూడా తీవ్రంగా స్పందించి, పోలీసులకు వారిని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అమెరికాకు పారిపోదామనుకున్న ఈ సైకోను తెలంగాణ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసి తీసుకొచ్చారు.Praneet arrested in Bengaluru.

రోస్టింగ్​ అంటే(Roasting)… ఎవరినైనా నీచంగా విమర్శించడం. ఏదైనా ఒక విడియోనో, ఫోటోనో పట్టుకుని ఇద్దరు ముగ్గురు కలిసి,  దానిపై అసహ్యంగా కామెంట్లు చేయడం. ఇది ఈ మధ్య బాగా పాపులర్​​ అవుతోన్న ట్రెండ్​. ఇదోరకం సైబర్​ బుల్లీయింగ్​- Cyber Bullying (సాంకేతికత సహాయంతో ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వేధించడం) అయితే దేన్ని అతి చేయకుండా ఉండటం మనవాళ్లకు అలవాటు లేదు కాబట్టి, అత్యంత నీచమైన రోస్టింగ్​ విడియోలు(Highest Hate Roasting Videos from India)  భారత్​లోనే తయారవుతున్నాయని ఇంటర్​నెట్​ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రణీత్​ కుటుంబం విషయానికొస్తే, ఆశ్చర్యకరంగా తండ్రి ఒక ఐఏఎస్​ అధికారి(IAS Officer Arun Kumar, 2004 Batch). పేరు అరుణ్​కుమార్​. నిన్నమొన్నటి వరకు ఆయన ఆంధ్రప్రదేశ్​లో విధులు నిర్వర్తించారని తెలుస్తోంది. ఈ ఘటనపై ఆయన నుండి ఎటువంటి స్పందనా వ్యక్తం కాలేదు. ప్రణీత్​ అన్నయ్య అజయ్​ హనుమంతు. ఇతనికి కూడా ఏయ్​ జూడ్​ (AyeJude) అనే ఓ యూట్యూబ్​ చానెల్​ ఉంది. అందులో ఫ్యాషన్​ ట్రెండ్స్​పై టిప్స్​, ట్రిక్స్, స్టైలింగ్​ గురించి విడియోలు పెడుతుంటాడు. తండ్రి అంత పెద్ద అధికారయినప్పుడు వీరిద్దరికెందుకో ఈ దిక్కుమాలిన రోగం. ఏం చదువుకున్నారో తెలియదు. అదేం నేర్పిందో తెలియదు.

అన్నట్లు, ఈ మహానుభావుడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా ధరించాడు. సుధీర్ బాబు సినిమా ‘హరోం హర'(Harom Hara), అంతకంటే ముందు ఆహా ఓటీటీలో విడుదల అయిన ఫిల్మ్ ‘మై డియర్ దొంగ'(My dear Donga)లో ఓ పాత్ర పోషించాడు. ‘కీడా కోలా'(Keeda Cola) కు దర్శక నటుడు తరుణ్ భాస్కర్ దాస్యం(Tharun Bhascker Dhaassyam ‌‌– స్పెల్లింగ్​ చూసి కంగారు పడకండి.. అది తరుణ్​ భాస్కర్​ దాస్యమే.. న్యూమరాలజీ అనుకుందాం) చేసిన ప్రమోషనల్ వీడియో కూడా ఈ గురువుగారి సృష్టే.  ప్రణీత్​ సేవలను ఉపయోగించుకున్న నటులు సుధీర్​బాబు, కార్తికేయ తర్వాత ప్రణీత్​ సాడిజాన్ని ఖండిస్తూ, ప్రజలకు సారీ చెప్పారు. వీడు ఇటువంటివాడు అని తెలియక ఇంటర్వ్యూలు ఇచ్చామని, తన సినిమాల ప్రమోషన్​ కోసమే తప్ప వేరే ఉద్దేశ్యం తమకు లేదని తెలిపారు.

ఇంత జరిగినా, పశ్చాత్తాపం లేని ప్రణీత్​ మళ్లీ ఓ విడియో విడుదల చేసి, క్షమాపణ కోరుతున్నట్లుగా నటిస్తూ, తనది డార్క్​ హ్యుమర్​గా సమర్థించుకునే ప్రయత్నం చేసాడు. తన యూట్యూబ్​ చానెల్​లో తన గురించి పెట్టుకున్న About కామెంట్​ ఏంటో తెలుసా? Alter ego of Praneeth Hanumantu. Unapologetically crowd pleasing content to satisfy the attention whore in me. (అంటే, ప్రణీత్​ మరో వ్యక్తిత్వం ఏంటంటే, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా కేవలం ప్రశంసల కోసం,  చూసేవారికి అత్యంత ఆకర్షణీయమైన విషయాన్ని అందించేవాడు) . చూసారు కదా.. ఇదీ అతని మెంటాలిటీ. ఇప్పుడింకా అతన్ని జనాలు విపరీతంగా అసహ్యించుకుంటున్నారు. కోర్టు అతనికి 14రోజుల రిమాండ్​(14 Days of Remand) విధించింది. కానీ, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు.

నిజానికి ఇటువంటి వికృత పోకడలకు ఆజ్యం పోసింది “ఈనాడు”(Eenadu) సంస్థలు కావడం శోచనీయం. ఉషాకిరణ్​ మూవీస్​ బ్యానర్​ కింద అప్పుడెప్పుడో పదో తరగతి పిల్లల పాత్రలతో ప్రేమ, కడుపు కథతో ‘చిత్రం’(Chitram Movie) సినిమా తీసి, ట్రెండ్​గా చెప్పుకున్న ఆ సంస్థ, తన ఈటీవీ ద్వారా, మల్లెమాల ప్రొడక్షన్స్​ నిర్మించి(స్తు)న్న ‘జబర్దస్త్​’(Jabardasth) అనే అసహ్యమైన కార్యక్రమం కూడా ప్రసారం చేస్తూ, అసభ్య, అనైతిక, అసహ్యకర మాటలకు ఆదిగురువయింది. ఇప్పటికీ జబర్దస్త్​ మీద ఎన్ని విమర్శలు, కోర్టు అక్షింతలూ పడ్డప్పటికీ నిరాటంకంగా సాగుతోంది ఈ కార్యక్రమం. ఇదే సినిమా నటులు ఆ ప్రోగ్రాంకు అతిథులుగా వస్తూ, ఇలాంటివాటిని ఎంకరేజ్​ చేస్తుంటారు. ఇదే మన దరిద్రం. సోషల్​ మీడియా ఎన్ని రకాలుగా మనుషులపై విషం చిమ్ముతోందో తెలియడానికి ప్రణీత్​ సంఘటన ఒక ఉదాహరణ.