Rashmi Goutham | తెలుగు బుల్లితెరపై రష్మి గౌతమ్ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే షో జబర్దస్త్. ఈ కామెడీ షోతోనే ఆమెకు స్టార్ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దాదాపు 13 ఏళ్లుగా ఒకే షోను నడిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుండటం ఆమె కెరీర్‌లో అరుదైన ఘనత. ఒక కార్యక్రమం ఇంతకాలం కొనసాగడమే కాకుండా, దానికి ఒకే యాంకర్ ఉండడం టీవీ చరిత్రలోనే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. కొన్నేళ్ల పాటు అనసూయ కూడా యాంకరింగ్ చేసినప్పటికీ, ఆమె తప్పుకున్న తర్వాత రష్మి ఒక్కరే రెండు ఎపిసోడ్లను విజయవంతంగా నడిపిస్తోంది. యాంకర్‌గా గుర్తింపు వచ్చినా, మొదట్లో రష్మి లక్ష్యం హీరోయిన్ కావడమే. ఆ ఆశతోనే సినిమాల వైపు అడుగులు వేసింది.
ఆరంభంలో సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. హోలీ, కరెంట్, ఎవరైనా ఎపుడైనా, గణేష్, బిందాస్, ప్రస్థానం, గురు, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో విభిన్న క్యారెక్టర్స్ చేసింది. ముఖ్యంగా గుంటూరు టాకీస్ సినిమా ఆమెకు మంచి బ్రేక్‌ను ఇచ్చింది. అలాగే అంతం, బొమ్మ బ్లాక్‌బస్టర్ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా కనిపించి నటిగా తన సత్తా చూపించింది. అయితే నటిగా తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఆమెను తీవ్రంగా ఆలోచింపజేశాయని రష్మి పలుమార్లు చెప్పింది. ప్రారంభంలో ఎక్కువగా చెల్లి పాత్రలు చేయడంతో అదే ఇమేజ్ తనపై పడిపోయిందని, ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలకే అవకాశాలు వచ్చాయని వెల్లడించింది. తన పేరు కన్నా “ఆ సినిమాలో చెల్లిగా చేసిన అమ్మాయి” అనే గుర్తింపే ఎక్కువగా ఉండేదని వాపోయింది. సెట్‌లలో హీరోలు, హీరోయిన్లకు ఉండే గౌరవం, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉండదని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ పరిస్థితులు చూసి విసిగిపోయిన రష్మి, సినిమాలపై ఆసక్తి తగ్గిందని, అదే కారణంగా తాను కొంత దూరం వచ్చేసానని తెలిపింది. ఒకసారి ఒకే తరహా పాత్రలు చేస్తే అదే ముద్ర పడిపోతుందని, ఆ ముద్ర నుంచి బయటపడటం చాలా కష్టమని ఆమె అభిప్రాయపడింది. అందుకే సినిమాల కన్నా టెలివిజన్ షోలే తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చాయని చెప్పింది. ఇటీవల కాలంలో రష్మి సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, బుల్లితెరపై మాత్రం బిజీగానే ఉంది. చివరగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో డాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. అలాగే తన కెరీర్ ఆరంభంలో యువ, లవ్ వంటి సీరియల్స్‌లో నటించిన రష్మి, ఆ తర్వాత పూర్తిగా షోల వైపు మళ్లింది. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో ఇంటింటా అభిమానులను సంపాదించింది.
