Site icon vidhaatha

2 women molested in Hampi: హంపిలో ఒక విదేశీయురాలు స‌హా ఇద్ద‌రిపై రేప్‌.. మ‌రో పురుష టూరిస్ట్ మృతి

2 women molested in Hampi:   ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క కేంద్రం, ప్రపంచ‌ వార‌స‌త్వ ప్రాంత‌మైన‌ హంపిలో దారుణం చోటు చేసుకున్న‌ది. ఒక విదేశీయురాలు స‌హా ఇద్ద‌రు మ‌హిళా ప‌ర్యాట‌కుల‌పై గురువారం రాత్రి ముగ్గురు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. వారితోపాటు ఉన్న ఒక పురుష ప‌ర్యాట‌కుడు శ‌నివారం తెల్ల‌వారుజామున శ‌వ‌మై తేలాడు. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన వ్య‌క్తులు అత‌డిని తుంగ‌భ‌ద్ర న‌ది కాలువ‌లోకి నెట్టివేయ‌డంతో అత‌డు గ‌ల్లంత‌య్యాడు. శ‌నివారం ఉద‌యం అత‌డి మృత‌దేహం ల‌భ్య‌మైంది. కొప్ప‌ల్ జిల్లా అనెగుండి ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై గంగావ‌తి రూర‌ల్ పోలీసులు ముగ్గురు గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేశారు. హంపి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు అనెగుండి పాపుల‌ర్ ప్ర‌దేశం. రేప్‌, దోపిడీ, దాడి, హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోద‌యినా.. హ‌త్యాభియోగాలు కూడా చేర్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని పోలీసులు తెలిపారు.

ఇద్ద‌రు విదేశీయులు స‌హా న‌లుగురు ప‌ర్యాట‌కులు, వారి మ‌హిళా గైడ్ తుంగభ‌ద్ర కెనాల్ వ‌ద్ద సేద‌దీరుతున్న స‌మ‌యంలో స‌మ‌యంలో ఆగంగ‌త‌కులు వారిని స‌మీపించి దాడి చేశార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో మ‌హిళా గైడ్ (29) పేర్కొన్నారు. ఆ ముగ్గురు వ్య‌క్తులు క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో మాట్లాడార‌ని, వారి వ‌య‌సు 20 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉంటుంద‌ని ఫిర్యాదులో తెలిపారు. అమెరికాకు చెందిన‌ డేనియ‌ల్ పిటాస్ (23), మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌కు చెందిన‌ పంక‌జ్ పాటిల్ (42), ఒడిశాకు చెందిన బిబాష్ (26)ల‌ను న‌దిలోని నెట్టివేశార‌ని పేర్కొన్నారు. అనంత‌రం త‌న‌తోపాటు, 27 ఏళ్ల ఇజ్రాయెలీ మ‌హిళా ప‌ర్యాట‌కురాలిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని ఫిర్యాదులో తెలిపారు. న‌దిలోకి నెట్టేసిన‌వారిలో బిబాష్ మృత‌దేహాన్ని శ‌నివారం ఉద‌యం న‌ది నుంచి వెలికి తీశారు. ముగ్గురిని న‌దిలోకి నెట్టేశార‌ని, వారిలో ఇద్ద‌రు ఈదుకుంటూ బ‌య‌ట‌ప‌డ్డార‌ని కొప్ప‌ల్ ఎస్పీ రామ్ ఎల్ అర‌సిద్ది చెప్పారు. ప‌ర్యాట‌కులు ఎక్కువ మంది ఉన్న‌ప్ప‌టికీ.. దుందుడుకుగా దాడికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. ఇది స్థానిక గ్యాంగ్ ప‌నే అయి ఉంటుంద‌ని చెప్పారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు.

రాత్రిపూట న‌దీ తీరం వెంబ‌డి గ‌డిపేందుకు ప‌ర్యాట‌కులు త‌మ స్కూట‌ర్ల‌పై వెళ్లార‌ని పోలీసులు పేర్కొన్నారు. తుంగ భ‌ద్ర ఏడ‌మ కాలువ స‌మీప సోనాపూర్ లేక్ వ‌ద్ద దుర్గ‌మ్మ గుడి ద‌గ్గ‌ర‌లో రాత్రి ప‌దిన్నర స‌మ‌యంలో గిటార్ ప్లే చేసుకుంటూ గ‌డుపుతున్న స‌మ‌యంలో దుండ‌గులు మోట‌ర్ సైకిళ్ల‌పై వ‌చ్చి దాడి చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెట్రోల్ కొంటారా? అని తొలుత అడిగిన నిందితులు.. అనంత‌రం వంద రూపాయ‌లు డిమాండ్ చేశార‌ని, తాము ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో దాడి చేశార‌ని ఫిర్యాదులో తెలిపారు. ముగ్గురు పురుషుల‌ను న‌ది కాలువ‌లోకి నెట్టేశార‌ని పేర్కొన్నారు. అనంత‌రం ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డి, వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, 9,500 న‌గ‌దు ఎత్తుకుని పారిపోయారు. తాము పెడ‌బొబ్బ‌లు పెడుతుండ‌టంతో మోట‌ర్ సైకిళ్ల‌పై పారిపోయార‌ని ఫిర్యాదులో తెలిపారు. న‌దిలో ప‌డిన పంక‌జ్‌ను డేనియ‌ల్ ర‌క్షించ‌గా, బిబాష్ మాత్రం చీక‌టిలో కొట్టుకుపోయాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Exit mobile version