Site icon vidhaatha

Tejeshwar murder | మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ స్ఫూర్తితో! తేజేశ్వర్‌ హత్య కేసులో సంచలన విషయాలు

Tejeshwar murder | ప్రైవేట్‌ సర్వేయర్‌ తేజేశ్వర్‌ని ఆయన భార్య ఐశ్వర్య హత్య చేయించినట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం గద్వాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక విషయాలను ఆయన వెల్లడించారు. వివాహమైన నెలకే ప్రియుడు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమల్‌రావుతో కలిసి ఐశ్వర్య కుట్ర చేసినట్లు తెలిపారు. సుపారీ గ్యాంగ్‌ సాయంతో భర్తను చంపించినట్లు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

తేజేశ్వర్ ఈనెల 17న అదృశ్యమవ్వగా 21న గాలేరు- నగరి కాల్వలో ఆయన మృతదేహం లభ్యమైందని తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరుమల్ రావు కెనరా బ్యాంకుకు అనుబంధంగా ఉన్న కెన్ ఫిన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. తన బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తున్న కర్నూలు పట్టణం కల్లూరు కు చెందిన సుజాత ఆర్థిక అవసరాలు తీరుస్తూ ఆమెతో తిరుమల్ రావు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె కూతురు ఐశ్వర్యతోను సంబంధం ఏర్పరచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే గత ఏడాది డిసెంబర్ లో తేజేశ్వర్ కు ఐశ్వర్యతో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచే తేజేశ్వర్‌ను హతమార్చేందుకు తిరుమల్‌రావు, ఐశ్వర్య కుట్ర చేశారని, ఈ హత్యకు తిరుమల్‌రావు సుపారీ ఇచ్చారని ఎస్పీ వెల్లడించారు. బ్యాంకులో రుణం కోసం తన వద్దకు వచ్చిన నగేశ్‌తో హత్యకు ఒప్పందం చేసుకున్నాడు.

తేజేశ్వర్‌ కదలికలు తెలుసుకునేందుకు అతడి బైక్‌కు నిందితులు జీపీఎస్‌ అమర్చారని వివరించారు. ఈ క్రమంలో మే 18న ఐశ్వర్యతో తేజేశ్వర్ పెళ్లి కూడా జరిగిపోయింది. దీంతో తిరుమల్ రావు సుపారీ గ్యాంగ్‌ను తేజేశ్వర్‌ను త్వరగా చంపాలని మరోసారి పురమాయించాడు. పథకం మేరకు పొలం సర్వే గురించి మాట్లాడదామని నిందితులు తేజేశ్వర్‌ను మభ్యపెట్టి కారులో తీసుకెళ్లి వేటకొడవళ్లతో హతమార్చి మృతదేహాన్ని గాలేరు-నగరి కాలువలో పడేశారని తెలిపారు. నిందితులు ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్‌ మర్డర్‌ కేసు గురించి చర్చించుకుని.. ఆ కేసుతో మాదిరిగాగా పోలీసులకు దొరక్కూడదని మాట్లాడుకున్నారని చెప్పారు. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని తిరుమల్‌రావు ప్రణాళిక రచించి..తేజేశ్వర్ హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లద్దాఖ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నాడని..ఇందుకోసం బ్యాంకు నుంచి 20లక్షలు కూడా డ్రా చేసుకున్నాడని..ఇంతలోనే పోలీసులకు చిక్కాడని ఎస్పీ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడం లో ప్రతిభ చూపిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీకాంత్, ధరూర్ ఎస్సై కొండా శ్రీ హరి, మల్దకల్ ఎస్సై నందికర్, గట్టు ఎస్సై మల్లేష్, ఐ‌టి సెల్ ఎస్సై సుకూర్, పి.ఎస్సైలు స్వాతి, తేజేశ్విని, సిబ్బందిలను జిల్లా ఎస్పీ .శ్రీనివాస రావు అభినందించి క్యాష్ రివార్డు అందించారు.

Exit mobile version