ఈ 16 గుణాలు ఉన్నాయి కాబట్టే రాముడు దేవుడు అయ్యాడు ..శ్రీరాముడి పదహారు సద్గుణాలు ఏవి?

ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు.

  • Publish Date - April 17, 2024 / 07:51 AM IST

దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం ‘శ్రీరామాయణం’. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. ప్రతీసారి ఏదో కొత్త విషయం బోధపడుతుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి పదహారు సద్గుణాల సంపన్నుడని నారదమహర్షి  కొనియాడాడు.

మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు.

మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం.

 

కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |

విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ||

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః |

కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||

(తా|| ఈ సమస్త లోకములలో సకల సద్గుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు , సత్యవాక్యుడు , దృఢసంకల్పము గలవాడు ఎవడు ?సర్వభూతములకు హితము కోరువాడు , విద్వాంసుడు , సమర్థుడు , ప్రియదర్శనుడు, ధైర్యశాలియు, క్రోధమును జయించినవాడు ఏవడు ? శోభలతో విలసిల్లువాడు , అసూయలేనివాడు కుపితుడైనచో దేవాసురలను సైతము భయకంపితులను జేయగలవాడు ఎవడు ?)

ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు.

అవే..

  1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.

ఈ పదహారు గుణాలు కలిగినవాడే సంపూర్ణ మానవుడని రుజువు చేసి చూపించిన మహామానవుడు శ్రీరాముడు.

 

Latest News