Betel Plant | తమలపాకు.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తమలపాకు( Betel Plant )లేనిదే పూజలు, వ్రతాలు చేయరు. కచ్చితంగా ఆ ఆకు ఉండాల్సిందే. ఇక వడిబియ్యం సమర్పించినప్పుడు తమలపాకును తాంబూలంగా సమర్పిస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా తమలపాకు శరీరానికి ఎంతో మంచిది. రోజుకు నాలుగైదు తమలపాకులను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అనేక లాభాలు ఉండడంతో ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే ఈ తమలపాకు మొక్కను పెంచుకుంటున్నారు. అయితే వాస్తు ప్రకారం ఈ తమలపాకు మొక్కను ఇంట్లో ఏ దిశలో పెంచుకోవాలి..? ఏ దిశలో పెంచితే డబ్బుకు లోటు ఉండదు.. అనే విషయాలు తెలుసుకుందాం.
ఏ దిశలో తమలపాకు మొక్కను పెంచాలి..?
ఇంట్లో తమలపాకు మొక్కకు అనువైన దిశ ఏది అంటే తూర్పు అనే చెప్పాలి. ఎందుకంటే అటు వైపు సూర్యరశ్మి అధికంగా ఉంటుంది. తూర్పు వైపునకు ఉంచడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది. తద్వారా ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. వీలైనంత వరకు తూర్పు దిశలోనే ఈ మొక్కను పెంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్థిక కష్టాలు మాయం..!
హిందూ సంప్రదాయంలో తమలపాకుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుంది. అయితే ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో.. ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడు అనే నానుడు ఉంది. తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు కూడా ఉండవని, ఇంట్లో డబ్బుకు లోటు ఉందని చెబుతారు. సరిగ్గా కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది..
తమలపాకు తీగ ఇంట్లో ఉండటం వల్ల సాక్షాత్తూ లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్టే అంట. ఈ మొక్క ఏపుగా చక్కగా పెరిగితే.. అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు. డబ్బును దాచుకునేందుకు మార్గాలు ఏర్పడుతాయని నమ్ముతారు.