Bed Room | ఇంటి నిర్మాణంలో పడక గది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే.. ఆ ఇంటి పెద్ద దిక్కైన దంపతులు( Couples ) అధిక సమయం గడిపేది పడక గదిలోనే. అంతేకాదు.. విలువైన వస్తువులను కూడా బెడ్రూంలోనే భద్రపరుస్తుంటారు. ఇక దంపతులు అన్యోన్యంగా ఉండేది.. ఆనంద క్షణాలు గడిపేది కూడా ఆ పడకగదిలోనే. మరి దంపతుల జీవితంలో ఎంతో కీలకమైన పడక గదిలో వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దంపతుల సుఖనిద్రకు వినియోగించే మంచం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మనం నిద్రించే మంచం చుట్టూ కొన్ని వస్తువులను ఉంచకూడదు అని, అవి ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆ దంపతుల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. అశుభ ఫలితాలు కూడా ఎదురై.. జీవితం అగమ్యగోచరంగా మారుతుందట. మరి మంచం వద్ద ఎలాంటి వస్తువులు ఉంచకూడదో తెలుసుకుందాం..
పడకగదిలో ఉంచకూడని వస్తువులు ఇవే..
అద్దం
చాలా మంది తమ బెడ్రూంలలో అద్దాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. పడక గదిలో అద్దాలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుందట. దీంతో పీడకలలు, నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒక వేళ బెడ్రూంలో అద్దం గనుక ఉంటే.. రాత్రి సమయాల్లో దాన్ని తీసి పెట్టడం మంచిది. లేదంటే మంచానికి దూరంగా ఉంచడం మంచిది.
మొక్కలు
పడక గదిలో ఆహ్లాదకర వాతావరణం కోసం చాలా మంది మొక్కలను పెడుతుంటారు. స్వచ్ఛమైన గాలి కోసం, మానసిక ప్రశాంతత కోసం మొక్కలను పెడుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. కాక్టి వంటి స్పైకీ లేదా ప్రిక్లీ మొక్కలు శక్తి ప్రవాహాన్నికి ఆటంకం కలిగిస్తాయి. అయితే ప్రశాంతత కోసం గుండ్రని, మృదువైన ఆకులు ఉన్న మొక్కలను పెట్టుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు
చాలామంది మంచానికి దగ్గరగా సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచుతుంటారు. అయితే ఇలాంటి పరికరాలను పడకగదికి దూరంగా ఉంచాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఈ గాడ్జెట్‌ల ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాలు మీ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ పరికరాల ప్రతికూల శక్తులు మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.
పగిలిపోయిన వస్తువులు
సగం విరిగిన లేదా పగిలిపోయిన వస్తువులను ఎప్పుడూ కూడా పడకగదిలో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి వస్తువులను ఉంచితే మీ కోరికలు, కలలు నెరవేరవు. అంతేకాదు ఈ వస్తువులు మీకు అసౌకర్యంగా అనిపిస్తాయి. నిద్రకు భంగం కలిగిస్తాయి. గది వాతావరణాన్ని పాడుచేస్తాయి. అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే గదిలో నుంచి తీసివేయండి.