Nagula Chavithi | ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నాగుల చవితి( Nagula Chavithi ) ని జరుపుకునేందుకు భక్తులందరూ సిద్ధమయ్యారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి భక్తులు పూజలు చేస్తుంటారు. అయితే ఈ నాగుల చవితికి ఒక ప్రత్యేకత ఉంది. నాగుల చవితి మరుసటి రోజే గరుడ పంచమి( Garuda Panchami ) వస్తుంది. ఈ రెండింటిని కలిపి నాగపంచమి( Nag Panchami )గా పాములను భక్తులు పూజిస్తుంటారు. నాగపంచమి రోజున పాముల( Snakes )ను పూజిస్తే జాతకంలో ఉండే రాహుకేతు దోషాలతో పాటు కాలసర్ప దోషం( Kalasarpa Dosham ), గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వివాహం, సంతానానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సమసిపోతాయని కూడా నమ్మకం.
మరి ముఖ్యంగా కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందేందుకు నాగులచవితి రోజు పూజచేయడం చాలా ముఖ్యం. జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలన్నీ రాహు-కేతు మధ్య ఉంటే దాన్నే కాలసర్ప దోషం అంటారు. ఈ దోషం ఉంటే అడుగడుకునా ఇబ్బందులే ఎదురవుతాయి. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో అన్నింటా ఆటంకాలే.. మనశ్సాంతి ఉండదు. వీటన్నింటి నుంచి నివారణ కోసం నాగులచవితి రోజు పాములను పూజిస్తారు. మరికొందరికి తరచూ పాములు కలలో కనిపిస్తుంటాయి. ఆ కలలు మంచివా కాదా అన్న విషయం పక్కన పెడితే.. పదే పదే పాములు కనిపించడంతో భయపడుతుంటారు. అలాంటివారు కూడా నాగులచవితిరోజు నాగేంద్రుడిని పూజిస్తే భయపెట్టే కలలు ఆగిపోతాయని చెబుతున్నారు పండితులు.
కాలసర్ప దోష నివారణకు ఇలా చేయండి..
నాగుల చవితి రోజు ఇంటిని శుభ్రంచేసేటప్పుడు ఉప్పు, ఆవు మూత్రం నీళ్లలో కలపండి. ఈ నీటితో ఇంటిని శుభ్రపరిచిన అనంతరం గుగ్గిలంలో ఇల్లంతా ధూపం వేయాలి. బంగారం లేదా వెండి లేదా రాగితో తయారు చేసిన పాము ఆకారానికి లేదా పిండితో తయారు చేసిన పాము ఆకారానికి అభిషేకం నిర్వహించాలి. ఈ సందర్భంగా నవనాగ నామ స్తోత్రం పఠించాలి. సర్పసూక్తంతో పాటూ పరమేశ్వరుడిని పూజించండి. గాయత్రి మంత్ర జపం చేయండి. జంట పాములకు పచ్చి పాలతో అభిషేకం చేసి.. చలిమిడి, చిమ్మలి నైవేద్యంగా సమర్పిస్తే కాలసర్పదోష ప్రభావం, సర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో పూజ అనంతరం శివాలయానికి వెళ్లి కొద్దిసేపు సేవ చేయండి. ఈ రోజు భూమిని తవ్వడం, మట్టిని తవ్వడం లాంటివి చేయకూడదు. వ్యవసాయ పనులు చేసేవారు కూడా ఈ రోజు పొలాల్లో పనిచేయరు. నాగలిని అస్సలు వినియోగించరు.
నవనాగ నామ స్తోత్రం
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!
నాగుల చవితి ఘడియలు ఇవే..
ఆగష్టు 08 గురువారం రాత్రి 9 గంటల 47 నిముషాల వరకూ నాగుల చవితి ఘడియలున్నాయి. అంటే ఆ రోజు సూర్యోదయం నుంచి చవితి ఉంది. తిథులు తగులు, మిగులు రాలేదు కాబట్టి ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేదు. ఆగష్టు 09 శుక్రవారం రాత్రి 11 గంటల 49 నిముషాల వరకూ గరుడ పంచమి ఉంది.