Masa Shivaratri | వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం మాస శివరాత్రి పూజ చాలా విశిష్ఠమైనది అని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం సమీపించే ముందు వచ్చే మాస శివరాత్రి ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందని పేర్కొంటున్నారు. మాస శివరాత్రి కూడా శుక్రవారం రోజు రావడం అనేది అరుదైన కలయిన అని చెబుతున్నారు. ఇలాంటి రోజున భక్తిశ్రద్ధలతో శివారాధన చేస్తే దారిద్య్రం తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని పండితుల నమ్మకం. కాబట్టి ఈ శుక్రవారం శివారాధన చేస్తే మంచిది. మరి ఏ సమయంలో శివారాధన చేస్తే మంచిదో తెలుసుకుందాం..
శివారాధన ఏ సమయంలో చేయాలి..?
అమావాస్య ముందు ఏ రోజైతే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చతుర్దశి తిథి ఉంటుందో, ఆ రోజును మాసశివరాత్రిగా జరుపుకుంటాం. అంటే ఆగస్టు 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3:27 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు మాస శివరాత్రి పూజకు శుభ సమయం అని పండితులు సూచిస్తున్నారు.
మాస శివరాత్రి పూజా విధానం ఏంటి..?
శుక్రవారం తెల్లవారుజామున మేల్కొని తలస్నానం ఆచరించాలి. అనంతరం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మీ పూజా మందిరంలో శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి. అనంతరం శివాష్టకం పఠిస్తూ తుమ్మి పూలతో కానీ, మారేడు దళాలతో కానీ శివయ్యను పూజించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ హారతులు, కర్పూర నీరాజనాలు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. ఉపవాస దీక్ష ఉంటున్నట్టు మనసులో అనుకోవాలి. ఇక ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం 3 గంటల తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి ఆలయంలో జరిగే శివాభిషేకాలు, అర్చనలలో పాల్గొనాలి. శివునికి 11 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం పూజారికి దక్షిణ తాంబులాలు ఇచ్చి నమస్కరించుకోవాలి.
అప్పుడే మాస శివరాత్రి పూజ సంపూర్ణం..
శివాలయం నుంచి ఇంటికి వచ్చి ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడే మాస శివరాత్రి పూజ సంపూర్ణం అవుతుంది. ముఖ్యంగా అమావాస్య ముందు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు తిరగబెట్టడం, తీవ్రమవడం జరుగుతూ ఉంటుంది. అందుకే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు చేసే మాస శివరాత్రి పూజ అనారోగ్య సమస్యలను పోగొట్టి దీర్ఘాయుష్షును ఇస్తుందని లింగపురాణంలో శివ మహా పురాణంలో వివరించారు.