Site icon vidhaatha

Tirumala | 18న తిరుమలలో శ్రీవారి కల్యాణోత్సవం రద్దు.. కారణాలు ఇవే..!

Tirumala | తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 18న శ్రీవారి కల్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17న తేది రాత్రి వరకు జరగనున్నాయి. దాంతో 18న కల్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

ఏటా తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తులు, సిబ్బంది కారణంగా తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాలు ఈ నెల 15 నుంచి 17 వరకు జరుగనుండగా.. 14న అంకురార్పణ చేయనున్నారు.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. 15న పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా 14న సహస్రదీపాలంకరణ సేవ, 15న తిరుప్పావడతో ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దయ్యాయి.

Exit mobile version