Akshaya Tritiya 2025 | అక్షయ తృతీయ( Akshaya Tritiya ) అంటే ఏమిటి? ఈ రోజున తప్పకుండా బంగారం( Gold ) కొనాలా! ఒక వేళ బంగారం కొనకపోతే ఏమవుతుంది? ఆకాశన్నంటిన ధరల కారణంగా పసిడి కొనలేని వారి పరిస్థితి ఏమిటి? బంగారం కొనలేని పక్షంలో దాన ధర్మాలు చేయొచ్చా..? ఒక వేళ దానధర్మాలు చేస్తే ఏం చేయాలి..? అసలు అక్షయ తృతీయ గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి? ఈ సందేహాలన్నిటికి సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం. వాస్తవానికి ప్రాచీనకాలంలో అక్షయ తృతీయకు పెద్దగా ప్రాచుర్యం లేదు. కానీ మూడు దశాబ్దాలుగా అక్షయ తృతీయ బాగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా ఉంటాయని నమ్మకం. అంటే తరగకుండా ఉంటాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఇలాంటి సమయంలో అందరికీ బంగారం కొనడం సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ అప్పు చేసి బంగారం, వెండి వంటివి కొంటే బంగారంతో పాటు అప్పులు కూడా అక్షయంగానే ఉంటాయన్న సంగతి మనం ఇక్కడ మర్చిపోకూడదు.
అక్షయ తృతీయ అంటే ఏమిటి..?
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయంలో సాక్షాత్తూ ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈ రోజున అక్షయుడైన విష్ణువు ఆరాధన విశేషంగా జరుగుతుంది కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు.
బంగారం కొనాలని ఉందా..?
అక్షయ తృతీయ వెనుక ఉన్న పురాణ విశేషాలు తెలుసుకున్నారు కదా! నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనాలని ఎక్కడా లేదు. ఇంకా ఈ రోజు దానాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అనవసరంగా అప్పులు చేసి అయినా బంగారం కొనాలన్నా ఆలోచన విడిచి పెట్టి మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ దానం చేయాలి. మన భారతీయ సంస్కృతి సంపదలను నలుగురితో పంచుకోవాలని చెబుతుంది కానీ. సంపదలను పెంచుకోవాలని ఎక్కడా చెప్పలేదు.
అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే సంపూర్ణ వ్రత ఫలం
అక్షతలు అంటే ఏ మాత్రం విరగని, పగుళ్లు లేని, గట్టిగా ఉన్న బియ్యంతో అక్షింతలను తయారు చేసి విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి అందులో కొంత భాగం బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణో చ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి అక్షయ తృతీయ వ్రతం చేసిన ఫలం తప్పక కలుగుతుంది.
ఈ దానాలు తప్పకుండా చేయాలి..
జలదానం: అక్షయ తృతీయ రోజు బాటసారుల దాహార్తి తీర్చే చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేస్తే కోటి రెట్లు పుణ్యఫలం ఉంటుంది. స్వర్గంలో ఉన్న పితృదేవతలు సంతోషిస్తారు.
జలపాత్ర: ఈ రోజు నీటిని చల్లగా ఉంచే నీటి కుండలు దానం చేయడం మంచిది.
ఛత్రం : అక్షయ తృతీయ రోజు వేడి నుంచి ఉపశమ కలిగించే ఛత్రం అంటే గొడుగు దానం చేస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుందని విశ్వాసం.
పాదరక్షలు : అక్షయ తృతీయ రోజు పాదరక్షలు అంటే చెప్పులు దానం చేస్తే జీవితంలో వేధించే బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.
అన్నదానం: అన్ని దానాలలో కెల్లా అన్న దానం శ్రేష్ఠం అని పెద్దలు అంటారు. అలాంటిది అక్షయ తృతీయ రోజు చేసే అన్నదానం వలన కలిగే పుణ్యఫలం వెలకట్టలేనిదని శాస్త్రవచనం.
వస్త్ర దానం : అక్షయ తృతీయ రోజు వస్త్ర దానం చేసిన వారికి జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదు.
మనం కూడా మన శక్తి కొద్దీ ఈ రోజు దానధర్మాలు చేసి అక్షయమైన ఫలాన్ని పొందుదాం. సుఖ సంతోషాలను పొందుదాం.
లోకా సమస్తా సుఖినో భవంతు: సర్వేజనా సుఖినోభవంతు!