భారతీయ సినీ పరిశ్రమకు.. బల్గేరియా రెడ్ కార్పెట్!

భారతీయ సినీ పరిశ్రమను ఆకర్షించేందుకు బల్గేరియా ముందుకొచ్చింది. 25% క్యాష్ రిబేట్, తక్కువ నిర్మాణ వ్యయం, అత్యాధునిక స్టూడియోలు, అద్భుతమైన లొకేషన్లతో నిర్మాతలకు కొత్త అవకాశాలు.

హైదరాబాద్: భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్న వేళ.. యూరప్‌లోని బల్గేరియా దేశం భారతీయ సినీ పరిశ్రమకు కొత్త ప్రొడక్షన్ హబ్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది. తక్కువ నిర్మాణ వ్యయం, ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలు, అత్యాధునిక చిత్రీకరణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, విభిన్న సహజ-చారిత్రక లొకేషన్లతో బల్గేరియా భారతీయ చిత్ర నిర్మాతలను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమానికి ముందుండి నాయకత్వం వహిస్తున్న టీఎల్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బల్గేరియా షెడ్యూల్ నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్ టోడర్ లాజరోవ్ జుజి భారతీయ చిత్ర పరిశ్రమతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సంద‌ర్భంగా జుజి మాట్లాడుతూ.. “బల్గేరియా కేవలం ఒక అందమైన షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదు. ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు పూర్తి స్థాయి సేవలను అందించగల సమగ్ర సినీ నిర్మాణ భాగస్వామి. భారతీయ నిర్మాతలకు యూరప్‌లో చిత్రీకరణను మరింత సులభం, వేగవంతం, పోటీ సామర్థ్యంతో కూడినదిగా మార్చడమే మా లక్ష్యం” అని తెలిపారు. బల్గేరియాలో చిత్రీకరణ చేపట్టే భారతీయ నిర్మాతలకు అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. హాలీవుడ్‌తో పాటు అనేక అంతర్జాతీయ చిత్రాలకు ఆతిథ్యమిచ్చిన అనుభవం బల్గేరియాను యూరప్‌లో విశ్వసనీయ చిత్రీకరణ కేంద్రంగా నిలబెట్టిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారతీయ నిర్మాతలకు బల్గేరియా ప్రత్యేక ఆకర్షణలు

▪️ తక్కువ నిర్మాణ వ్యయం
▪️ అర్హత కలిగిన చిత్రాలకు 25 శాతం క్యాష్ రిబేట్
▪️ యూరప్‌లోనే అత్యల్ప కార్పొరేట్ పన్ను విధానం
▪️ అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోలు, సౌండ్ స్టేజ్‌లు
▪️ అంతర్జాతీయ అనుభవం కలిగిన సాంకేతిక నిపుణులు
▪️ అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్, సీజీఐ, పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు
▪️ మధ్యయుగ కోటలు, రోమన్ శిథిలాలు, పర్వతాలు, అడవులు, బ్లాక్ సీ తీరాలు, ఆధునిక యూరోపియన్ నగరాలు వంటి విభిన్న చిత్రీకరణ ప్రాంతాలు

భారత్‌తో మరింత బలమైన సినీ బంధం


“యూరప్‌లో సినిమా తీయాలనుకున్న ప్రతి భారతీయ నిర్మాతకు మొదట గుర్తుకు వచ్చే దేశాల్లో బల్గేరియా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు, అద్భుతమైన లొకేషన్లు, పోటీ ప్రోత్సాహకాలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ అనుభవంతో మేము సిద్ధంగా ఉన్నాం” అని జుజి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బల్గేరియా షెడ్యూల్‌లో పనిచేసిన సందర్భంగా భారతీయ సినీ పరిశ్రమతో ఆయనకు ఏర్పడిన అనుబంధం మరింత బలపడింది. ప్రస్తుతం భారతీయ చిత్రాలతో మరిన్ని సంయుక్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

భారత్‌లో ‘టాడ్ యాష్ చాప్టర్‌హౌస్’

భారతీయ సంస్కృతిపై ఉన్న అభిమానంతో ఆశిష్ గణేషన్ తో కలిసి * సూపర్ హీరో చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహిస్తునట్లు జుజి వెల్లడించారు. “నా సినీ ప్రయాణం బల్గేరియాలో ప్రారంభమైనా.. నా మనసు మాత్రం భారతదేశంతో మమేకమై ఉంది. భారతీయ సంస్కృతి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. గొప్ప కథలకు సరిహద్దులు ఉండవని నేను నమ్ముతాను. అశిష్ గణేశన్‌తో కలిసి రూపొందిస్తున్న సూపర్ హీరో చిత్రానికి నిర్మాతగా, దర్శకుడిగా పనిచేయడం నాకు గర్వకారణం. ఆ చిత్రంలోని కీలక భాగాన్ని బల్గేరియాలో చిత్రీకరిస్తున్నాం. బల్గేరియాలో పనిచేస్తున్న ఓ భారతీయుడిలా నేను భావిస్తున్నాను. భారతీయ ప్రతిభతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టం” అని జుజి అన్నారు.

యూరప్‌కు భారతీయ సినిమాకు గేట్‌వే

టీఎల్ ప్రొడక్షన్ ద్వారా భారతీయ చిత్రాలకు లొకేషన్లు, సాంకేతిక బృందాలు, లాజిస్టిక్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, చిత్రీకరణ నిర్వహణ తదితర అన్ని అంశాల్లో సమగ్ర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జుజి తెలిపారు. అత్యాధునిక మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, ప్రకృతి సోయగాలు, నిర్మాణానికి అనుకూలమైన ఆర్థిక విధానాలతో బల్గేరియా.. భారతీయ సినిమాలకు యూరప్‌లో కొత్త నిలయంగా మారేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు

Latest News