Chiranjeevi | తండ్రి ఇచ్చిన ఒక మాట ఓ విద్యార్థినిలో అసాధారణమైన పట్టుదలను నింపింది. ఆ ప్రోత్సాహమే ఆమెను రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలబెట్టింది. తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎం. రుషి సాధించిన విజయానికి ఇప్పుడు మరో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆమె కలల హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కలిసి అభినందించడం విశేషంగా మారింది.
రుషి విజయం వెనుక ఉన్న కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా ఉన్న ఆమె తండ్రి, ఒకరోజు తన కూతురికి ప్రత్యేకమైన మాట ఇచ్చారట. “నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే, నిన్ను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పిస్తా” అని చెప్పిన ఆ మాట రుషిలో మరింత కష్టపడాలనే తపనను పెంచింది.
శాలువాతో సత్కారం..
ఆ మాటను లక్ష్యంగా చేసుకున్న రుషి రాత్రింబవళ్లు కష్టపడి చదివి తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. అంతేకాదు, 1986 తర్వాత గత దాదాపు 40 ఏళ్లలో ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. సాధారణంగా అబ్బాయిల ఆధిపత్యం ఎక్కువగా కనిపించే ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఒక అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం విశేషంగా మారింది.
తాజాగా తనను కలిసేందుకు వచ్చిన రుషి మరియు ఆమె కుటుంబ సభ్యులను చిరంజీవి తన నివాసంలో ఆత్మీయంగా స్వాగతించారు. ఆమె సాధించిన అద్భుత విజయాన్ని ప్రశంసిస్తూ శాలువాతో సత్కరించారు. అలాగే భవిష్యత్ చదువులకు ఉపయోగపడేలా ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు.
ప్రోత్సాహకరమైన సందేశం..
ఈ సందర్భంగా రుషి తన జీవిత లక్ష్యాన్ని కూడా వెల్లడించింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారి కావాలని తన కల అని చిరంజీవికి వివరించింది. ఆమె మాటలు విన్న చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రోత్సాహకరమైన సందేశం ఇచ్చారు.
“నీ లక్ష్యం వైపు ముందుకు సాగు. చదువును ఎక్కడా ఆపొద్దు. నీ ఐఏఎస్ చదువులకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి సంకోచం లేకుండా అడుగు” అని ఆమెకు భరోసా ఇచ్చారు. ఒక తండ్రి ప్రోత్సాహం, కూతురు కష్టపడే తత్వం, ఆ తర్వాత కలల హీరో నుంచి వచ్చిన అభినందన ఈ ప్రయాణం ప్రస్తుతం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
