ఇండియాలో GenZ.. ఉద్యమం రానుందా?

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల భారం, రాజకీయ అసంతృప్తి మధ్య ‘కాక్రోచ్ జనతా పార్టీ’తో GenZ ఉద్యమ చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఓ వైపు పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతలు..ఆ యుద్దంతో కుదేలవున్న భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభం వైపు సాగుతుండటం..పెరిగిపోతున్న ధరల భారం, నిరుద్యోగం..ఆర్థిక అసమానతలతో జనం ముఖ్యంగా యువత విసుగెత్తి పోతున్నారు. దీంతో దేశంలో ఏదో కొత్త మార్పు రావాలని ఓ వర్గం యువత బలంగా కోరుకుంటుంది. వారి ఆలోచనకు దేశంలో అధికార బీజేపీ వ్యతిరేక శక్తుల అసహనం కూడా తోడవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోనూ GenZ ఉద్యమం వచ్చేలా కనిపిస్తుందంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు భారత యువత సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై సోషల్‌మీడియా వేదికగా వేగంగా స్పందిస్తుండటం..ఏకీకృత అభిప్రాయాలను పంచుకోవడం పెరిగిపోతుండటం నిదర్శనంగా చెబుతున్నారు. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ.. తాజాగా అభిజీత్ దిప్కే అనే యువకుడు ఇన్‌స్టాలో ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ రేపుతున్న సంచలనం జెన్ జీ ఉద్యమ ఆశలకు జీవం పోస్తుంది. రాజ్యంగ వ్యవస్థలపై ఏక పార్టీ గుత్తాధిపత్యం అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలకు దారితీస్తుందని..ప్రస్తుతం దేశంలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం అలాగే కొనసాగుగుతుందని, ఈ పరిణామాలు జెన్ జీ ఉద్యమానికి బాటలు వేస్తాయని విశ్లేషిస్తున్నారు.

రోజురోజుకు పెరిగిపోతున్న మద్దతు

నిరుద్యోగం, వ్యవస్థపై అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు అభిజీత్ దిప్కే అనే యువకుడు ఇన్‌స్టాలో ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సంచలనం సృష్టిస్తోంది. ‘యువత కోసం, యువత చేత’ అనే నినాదంతో వచ్చిన ఈ హ్యాండిల్‌కు 3 రోజుల్లోనే 36 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. సహజంగానే అధికార ఎన్డీఏ కూటమి వ్యతిరేక రాజకీయ శక్తులు సైతం ఈ ఫాలోవర్స్ లో చేరిపోయారు. టీఎంసీ ఎంపీలు మహువా మెయిత్రా, కీర్తి ఆజాద్ కూడా ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి మద్దతు తెలిపారు. వారికి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే యోధులకు స్వాగతం అంటూ సీజేపీ ఆహ్వనం పలికింది.

సీజేఐ బొద్దింకల వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీ

ఇటీవల నిరుద్యోగులు సోమరిపోతుల్లా..బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడిచేస్తున్నారంటూ సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చోపచర్చల క్రమంలోనే అభిజీత్ దిప్కే అనే యువకుడు ఇన్‌స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించినట్లుగా ఈ నెల 16న ప్రకటించారు. సెక్యులర్, సోషలిస్టు, డెమోక్రటిక్, లేజీ(సోమరితనం) తమ నినాదం అంటూ వ్యంగ్య నినాదాలుగా పేర్కొన్నాడు. తమ పార్టీ యువత కోసం పనిచేస్తుందని, ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని పేర్కొన్నారు.

ఆసక్తికర అంశాలతో అజెండా

తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనులతో కాక్రోచ్ పార్టీ ఐదు అంశాలతో అజెండా ప్రకటించింది. వాటిలో 1. పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోం అని హామీ 2. నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతాం. ఓటింగ్‌ హక్కుల నిరాకరణ ఉగ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదు. 3. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. కేంద్ర క్యాబినెట్‌లో సగం పదవులు మహిళలకు ఇస్తాం 4. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. గోదీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పని చేయటానికి దారులు వేస్తాం. 5. పార్టీ ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేల మీద 20 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తాం.

పార్టీలో చేరేందుకు అర్హతలు ఇవే

ఈ పార్టీలో పనిచేయడానికి అర్హతలుగా..నిరుద్యోగం, సోమరితనం(భౌతికంగానే..మానసికంగా కాదు), ఆన్ లైన్ కు(సెల్ ఫోన్, సోషల్ మీడియాకు) అతుక్కుని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్బుతంగా వెళ్లగక్కే నైపుణ్యం ఉండటం అని వ్యంగ్యంగా ప్రకటించారు. అభిజీత్ దిప్కే సీజేపీ ప్రకటన చేయగానే..కేవలం 48గంటల్లోనే 40వేల మంది ఫాలోవర్స్ రావడం విశేషం. టీఎంసీల ఎంపీలతో పాటు సామాజిక, స్వచ్చంసేవ కార్యకర్తలు కాక్రోచ్ పార్టీతో కలిసి పనిచేస్తామని ముందుకొచ్చి అధికార ఎన్డీఏపై తమ ఆగ్రహాన్ని కాక్రోచ్ పార్టీ నుంచి వెళ్ళగక్కారు.

సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ ఏకంగా సీజేపీ పార్టీ వెల్లడించిన అజెండా అంశాలకు కొన్ని సూచనలు సైతం అందించారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారిగా ఉండాలని, పీఏం కేర్స్ మాదిరిగా కాకుండా రహస్య వ్యక్తులు ఇచ్చే ఎలక్ట్రోరల్ బాండ్స్ వంటి పార్టీ విరాళాలు తీసుకోవద్దని, ఏప్పటికి కూడా రహస్య కాక్రోచ్ కేర్ ఫండ్స్ తీసుకోవద్దంటూ సూచించారు. ఆ సూచనలను సైతం సీజేపీ అజెండాలో చేర్చుతున్నామని అభిజీత్ దిప్కే పాటించడం..వాటికి భారీగా నెటిజన్లు నుంచి సానుకూల కామెంట్లు రావడం ఆసక్తి రేపింది.

నిజమైన రాజకీయ పార్టీగా మారుతుందా..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన, వ్యవస్థలపైన వ్యంగ్య ప్రశ్నలు సంధిస్తూ పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీ ఆన్ లైన్ వేదికగా దూసుకపోతుండటంతో..నిజంగానే ఈ పార్టీ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందా? జెన్ జీ వంటి సరికొత్త ఉద్యమానికి వేదిక అవుతుందా ? అన్న చర్చలు దేశ వ్యాప్తంగా ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో జోరందుకోవడం హాట్ టాపిక్ గా నిలిచింది.

బీజేపీ పాలనలో 70శాతంకు పైగా రాష్ట్రాలు

ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాల్లో 70శాతానికిపైగా బీజేపీ, మిత్రపక్షాల పాలనలోకి వచ్చాయి. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు గానూ బెంగాల్‌ విజయంతో 17 రాష్ట్రాలు బీజేపీ పాలనలో చేరాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి పాలన కొనసాగుతోంది. ఇక మిగిలిన ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయి.

బీజేపీ పాలనలో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గోవా, గుజరాత్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, ఒడిశా, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

ఎన్డీయే కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, సిక్కిం, పుదుచ్చేరి (రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతం) ఉన్నాయి. ఏపీలో టీడీపీ, మేఘాలయలో ఎన్‌పీపీ, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ, సిక్కింలో ఎస్‌కేఎం, పుదుచ్చేరిలో ఏఐఎన్నార్సీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా ఉంది.

ప్రతిపక్షాల చేతిలో టీవీకే తాజాగా గెలిచిన తమిళనాడు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌ కూటమి పాలనలోని కేరళ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, ఆప్‌ పాలనలోని పంజాబ్‌, జేఎంఎం పాలనలోని జార్ఖండ్‌, జెడ్‌పీఎం పాలనలోని మిజోరంలు ఉన్నాయి.

కాషాయ పార్టీ హవాకు కాక్రోచ్ పార్టీ చెక్ పెట్టేనా..?

కేంద్రంతో సహా 70శాతానికిపైగా రాష్ట్రాలలో బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్నాయి. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రోజురోజుకు బలహీన పడిపోతుంది. ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండియా కూటమి పార్టీల తమ అస్థిత్వ పరిరక్షణకు సొంత రాష్ట్రాలలో పోరాడుతున్నాయి. దేశంలో బీజేపీ శక్తుల అప్రజాస్వామిక విధానాలను, పాలనా వైఫల్యాలపు ప్రశ్నించడం కూడా నేరమైపోతుంది. ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రశ్నించే గొంతుకల అణిచివేత తీవ్రతరం అవుతుంది. ఇంకోవైపు బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలతో దేశాన్ని మరింతగా తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి చెక్ పెడుతుందా? అందుకు జెన్ జీ యువత సహకరిస్తుందా? అన్న చర్చ ఆసక్తి రేపుతుంది.

ప్రశ్నించే ఫ్లాట్ ఫామ్ గా నిలదొక్కుకోవాలి…

కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయినా..ఆ పార్టీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా శక్తిగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే ఆమ్ ఆద్మీ వంటి పార్టీలే బీజేపీ ఎత్తులకు చిత్తయిపోయాయని..సోషల్ మీడియాలో బలమైన సైన్యం ఉన్న బీజేపీని తట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ సైన్యం మనుగడ సాగించడం అంత సులభం కాదన్న వాదన సైతం వినిపిస్తుంది. అయితే జనం కోరుకుంటే..ఎంతటి నియంతృత్వ, ఏకస్వామ్య వ్యవస్థలైనా కూలిపోక తప్పదన్నది చారిత్రాక సత్యం అని..దేశంలో వ్యవస్థీకృత మార్పును జెన్ జీ కోరుకుంటే ఆ మార్పు తధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

మెలోని-మోదీల మెలోడీ బంధం వైరల్!
చైనాలో లక్షల మంది ఫాల్తూ సోషల్ మీడియా క్రియేటర్ల ఖాతాల సస్పెన్షన్‌

Latest News