Peddi Trailer | మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్వేందు శర్మ కనిపించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మే 18న ట్రైలర్..
ఇప్పటికే సినిమా పోస్టర్లు, ప్రచార కంటెంట్ మంచి స్పందన తెచ్చుకోగా, ఇప్పుడు ట్రైలర్‌పై ఆసక్తి మరింత పెరిగింది. మే 18న ముంబైలో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో ‘పెద్ది’ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన “చిరు లీక్స్” స్టైల్‌లో ట్రైలర్ చూసిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.
జస్ట్ వావ్..
ట్రైలర్ గురించి స్పందిస్తూ ఆయన, “పెద్ది ట్రైలర్ చూశాను… జస్ట్ వావ్! మూడు నిమిషాల ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. మీరు ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి” అంటూ పేర్కొన్నారు.
అలాగే చాలా రోజుల తర్వాత “చిరు లీక్స్” ఇస్తున్నానని చెబుతూ, ట్రైలర్‌లో హైలెట్‌గా ఉండబోతున్నట్లు భావిస్తున్న ఒక డైలాగ్‌ను కూడా పరోక్షంగా సూచించారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
మెగాస్టార్ స్వయంగా తన కుమారుడి సినిమా ట్రైలర్‌ను ఈ స్థాయిలో ప్రశంసించడంతో ‘పెద్ది’పై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం అభిమానులు ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభించగా, మే 18న విడుదలయ్యే ట్రైలర్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
