ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సీ జోసెఫ్ విజయ్.. గురువారం లోపు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. జిల్లాలకు ప్రాతినిధ్యం, కుల సమీకరణలు, రాజకీయ ప్రభావాలు.. అన్నీ అంచనా వేసుకుని మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి విజయ్ సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌కు రెండు క్యాబినెట్ స్థానాలు ఇవ్వటం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే.. ఈ విస్తరణలో అన్నాడీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అన్నాడీఎంకే చీలిక వర్గం కలిసి రావడంతో విజయ్ ప్రభుత్వం సులభంగా మెజార్టీ నిరూపించుకోగలిగింది. చీలిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చేందుకు టీవీకే భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ నుంచి ఎస్ రాజేశ్‌కుమార్, పీ విశ్వనాథన్‌లకు క్యాబినెట్ బెర్తులు ఖాయంగా చెబుతున్నారు. అన్నాడీఎంకే చీలిక వర్గం నుంచి షణ్ముగం, వేలుమణికి ఇవ్వొచ్చని తొలుత ఊహాగానాలు వచ్చాయి. వారిద్దరితోపాటు ఆ గ్రూపులో ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వొద్దని సీపీఎం, కాంగ్రెస్ పట్టుబడుతున్నట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మిత్రపక్షాల కూటమి ఐక్యత దెబ్బతింటుందనే ఉద్దేశంలో ఉన్న విజయ్.. వాటి మాట ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయాన్ని తాము పునరాలోచించుకోవాల్సి వస్తుందని అంతకు ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ షణ్ముగం చెప్పారు. టీవీకే అంతదాకా వెళ్లబోదని ఆశిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ద్వారా బీజేపీ దొడ్డిదోవన అధికారంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను నిరోధించేందుకే తాము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామని షణ్ముగం గుర్తు చేశారు. ఓటర్లు డీఎంకే కూటమిని, అన్నాడీఎంకే కూటమిని తిరస్కరించారని అన్నారు. అదే సమయంలో మరోసారి ఎన్నికలకు రాష్ట్రం సిద్ధంగా లేదని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకునే తాము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామని తెలిపారు.
మిత్రపక్షాలతోపాటు.. టీవీకే లీగల్ అడ్వయిజర్లు సైతం రాజకీయంగా ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం సరికాదని అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. అదే జరిగితే.. తొలి దశలోనే అస్థిర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వారు హెచ్చరించారని డీటీ నెక్స్ట్‌లో కథనం పేర్కొంటున్నది.
ఇదెలా ఉన్నా.. టీవీకే ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు.. ఫ్లోర్ టెస్ట్ సమయంలో అన్నాడీఎంకే చీలిక వర్గం రాజకీయ నిర్ణయం తీసుకున్నదని, దానికి తాము ప్రతిఫలం చెల్లించాల్సిన అవసరం లేదని విజయ్ వర్గం చెబుతున్నది.
క్యాబినెట్ రేసులో వీరే..
- ఎన్ మ్యారీ విల్సన్ (డాక్టర్ రాధాకృష్ణన్ నగర్)
- ఈసీఆర్ పీ శరవణన్ (షోలింగనల్లూర్)
- వీ సత్యభామ (తిరుప్పూర్ నార్త్)
- రేవంత్ చరణ్ (మధురవాయల్)
- ఉన్నత విద్య, రెవెన్యూ, రవాణా, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం వంటి పలు శాఖలకు మంత్రులను నియమించాల్సి ఉన్నది.