The Paradise | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఇటీవల సోషల్ మీడియాలో పలు రూమర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నానికి నచ్చలేదని, అందుకే మూవీకి రీషూట్ జరుగుతోందని ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించగా, తాజాగా మూవీ టీమ్ అధికారికంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
రీషూట్ జరుగుతోందన్న వార్తలను నిర్మాతలు పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగా రూపొందించిన ప్లాన్ ప్రకారమే కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 100కి పైగా షూటింగ్ రోజులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగిలిన భాగాల చిత్రీకరణ కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని వెల్లడించారు.
అలాంటి అవసరం రాదు..
సినిమాకు ఇప్పటివరకు ఒక్క రీషూట్ కూడా జరగలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి అవసరం ఉండదని మూవీ టీమ్ తెలిపింది. మొదట కథను ఎలా ప్లాన్ చేశారో అదే విజన్‌తో, అదే నమ్మకంతో ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు సూచించారు. అధికారికంగా విడుదల చేసే సమాచారం మాత్రమే నిజమని, ఎలాంటి నిర్ధారణ లేకుండా వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా వర్గాలను కూడా కోరారు. ఇకపై సినిమా గురించి అసత్య ప్రచారాలు కొనసాగితే వాటిపై నేరుగా స్పందిస్తామని నిర్మాతలు హెచ్చరించారు.
అనుకున్న టైమ్‌కే వస్తుంది..
ఇటీవల ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశముందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని మూవీ టీమ్ స్పష్టం చేసింది. మొదట మార్చిలో విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని, మెరుగైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆగస్టు 21, 2026కు మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు మరోసారి ధృవీకరించారు.
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుథ్ రవిచందర్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
