భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటలీ ప్రధాని మెలోని చూపిన అభిమానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీకి చేరుకున్నారు. ఆయనకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని స్వాగతం పలికారు. పర్యటనలో మోదీ, మెలోనీల ఆత్మీయ పలకరింపులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి మెలోడీ మూమెంట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మెలోనీకి మోదీ తమ రెండు పేర్లు కలిసేలా ఉండే పార్లె మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ను బహుమతి ఇవ్వడం వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో గంటలోనే అర మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం.
దౌత్య చర్చల కోసం రోమ్‌కు చేరుకున్న మోదీకి మెలోని విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు ప్రతిష్టాత్మక కొలెసియంను సందర్శించారు. అక్కడ వీరు సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను మెలోనీ ఎక్స్‌లో పంచుకుంటూ.. ‘రోమ్‌కు స్వాగతం మిత్రమా’ అని రాసుకొచ్చారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇటు మోదీ సైతం.. మెలోనీతో కారులో ప్రయాణం, విందు, కొలెసియంను సందర్శించిన చిత్రాలను ఎక్స్‌లో పంచుకున్నారు. రోమ్ లో దిగిన వెంటనే ప్రధాని మెలోనీతో కలిసి రాత్రి భోజనం చేశాను. అనంతరం ప్రతిష్టాత్మక కొలెసియంను సందర్శించాం. మేము పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్- ఇటలీ సంబంధాల బలోపేతానికి జరగనున్న చర్చల కోసం ఎదురుచూస్తున్నాను అని మోదీ తన పోస్టులో రాసుకొచ్చారు.
రోమ్‌లో కాశీ దర్శనం!
ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో మరో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. చారిత్రాక రోమ్ నగరంలో ఆధ్యాత్మిక పట్టణం వారణాసి దర్శనమిచ్చింది. ఇటాలియన్ చిత్రకారుడైన జియాంపాలో టోమాసెట్టి వారణాసిపై తాను రూపొందించిన కళాకృతులను మోదీ పర్యటనలో ప్రదర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతీయ సంస్కృతి పట్ల జియాంపాలోకు ఉన్న మక్కువ నాలుగు దశాబ్దాలకు పైగా నాటిదని తెలిపారు. 1980వ దశకంలో, వేద సంస్కృతికి సంబంధించిన పుస్తకాలతో చిత్రకారుడిగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2008 నుండి 2013 వరకు మహాభారతానికి సంబంధించిన 23 భారీ చిత్రాలను ఆయన అద్బుతంగా గీశారంటూ మోదీ కొనియాడారు.
Sweetness of Bharat and warmth of diplomacy !!
Hon’ble PM Shri @narendramodi Ji’s thoughtful gift of the iconic “Melody” toffee to Italian PM Giorgia Meloni turned a simple gesture into a memorable moment of friendship and smiles.#PMModiInItaly pic.twitter.com/Zqoclix7mm
— Kiren Rijiju (@KirenRijiju) May 20, 2026
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమవుతుంటే.. రీల్స్ చేసుకుంటారా.. రాహుల్ ఫైర్
ఇటలీ ప్రధాని మెలోనీకి.. మోడీ, మెలోనీ పేర్లు కలిసేలా మెలోడీ చాక్లెట్లు ఇవ్వడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ఒక ఆర్థిక సంక్షోభం మన నెత్తిమీదకు వస్తున్నది. మన ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు అందించడంలో బిజీగా ఉన్నారు. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు అందరూ ఏడుస్తుంటే.. ప్రధాన మంత్రి నవ్వుతూ రీల్స్ చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ శ్రేణులు చప్పట్లు కొడుతున్నాయి. ఇది నాయకత్వం కాదు.. ఇది బూటకం’ అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో చేసిన పోస్టులో విమర్శించారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ‘మెలోడీ’ ఈ రీల్స్‌పై స్పందించారు. ‘ప్రజలు ఆయన ప్రసంగాల ‘మెలోడీ’ని ఆస్వాదిస్తూ, అదే సమయంలో ప్రభుత్వ దోపిడీతో గురవుతున్న వేదనను భరిస్తూ బతకాలని ప్రధాన మంత్రి కోరుకుంటున్నారు’ అని ఎక్స్‌లో సెటైర్ వేశారు. ‘గడిచిన 11 ఏళ్ల మోదీ పాలనలో భారతీయల సగటు అప్పు 11 రెట్లు పెరిగింది. మరోవైపు 229 మంది కుబేరులు, కొత్తగా వందల కోట్ల అధినేతలైన 26 మంది ఆస్తులు 97.50 లక్షల కోట్లు దాటాయని వార్తలు వస్తున్నాయి’ అని ఖర్గే పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లడం వంటి సమస్యలతో దేశాన్ని మోదీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
జలమండలి జీఎం అక్రమాస్తుల చిట్టా పెద్దదే!
Singer | ప్రేమ పేరుతో దారుణం.. అదృశ్యమైన పంజాబీ సింగర్ హత్య, కాలువలో లభ్యమైన మృతదేహం
