Old City | భ‌గ్గుమంటున్న మండుటెండ‌లు.. పాత‌బ‌స్తీలో 50 శాతానికి ప‌డిపోయిన వ్యాపారం..!

Old City | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. మ‌ధ్యాహ్నం వేళ హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉండే మార్కెట్లు కూడా ఖాళీగా క‌నిపిస్తున్నాయి.

  • By: raj |    telangana |    Published on : May 20, 2026 8:02 AM IST
Old City | భ‌గ్గుమంటున్న మండుటెండ‌లు.. పాత‌బ‌స్తీలో 50 శాతానికి ప‌డిపోయిన వ్యాపారం..!

Old City | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. మ‌ధ్యాహ్నం వేళ హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉండే మార్కెట్లు కూడా ఖాళీగా క‌నిపిస్తున్నాయి. మ‌రి ముఖ్యంగా పాత‌బ‌స్తీలోని వ్యాపారాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. మండుటెండ‌ల కార‌ణంగా కొనుగోలుదారులు లేక‌.. వ్యాపారం 50 శాతానికి ప‌డిపోయింద‌ని పాత‌బ‌స్తీ వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.

వేడిగాలుల తీవ్ర‌త‌.. పూర్తిగా దెబ్బ‌తిన్న వ్యాపారం

సాధార‌ణంగా వేస‌వి సెల‌వులు వ‌చ్చాయంటే హైద‌రాబాదీలే కాకుండా తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు పాత‌బ‌స్తీకి పోటెత్తేవారు. మ‌దీనా నుంచి చార్మినార్ వ‌ర‌కు ఉన్న దుకాణాల‌ను సంద‌ర్శించి ర‌క‌ర‌కాల వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేవారు. ప్ర‌స్తుతం తీవ్ర‌మైన వేడిగాలుల కార‌ణంగా ప‌ర్యాట‌కులు ఎవ‌రూ కూడా పాత‌బ‌స్తీకి రావ‌డం లేదు. ఇండ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో త‌మ వ్యాపారం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ద‌ని న్యూ లాడ్ బ‌జార్‌కు చెందిన ఓ బ‌ట్ట‌ల వ్యాపారి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

గ‌తంలో ల‌క్ష మంది.. ఇప్పుడు 50 శాతానికి త‌గ్గుద‌ల‌

సాధార‌ణ రోజుల్లో పాత‌బ‌స్తీలోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు కానీ, దుకాణాల‌కు దాదాపు ల‌క్ష మంది వ‌చ్చేవారు. అయితే మే మొద‌టి వారం నుంచి ఈ సంఖ్య పూర్తిగా త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం 50 శాతానికి త‌గ్గిపోయింద‌ని, దీంతో త‌మ వ్యాపారం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ద‌ని తెలిపాడు.

ప‌ర్యాట‌క ప్రాంతాల‌కే ప‌రిమితం.. షాపింగ్‌కు దూరం..

చార్మినార్, మ‌క్కా మ‌సీదు, చౌమ‌హ‌ల్లా ప్యాలెస్ వంటి చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను వీక్షించేందుకు విదేశీ ప‌ర్యాట‌కుల‌తో పాటు ఉత్త‌ర భార‌త‌దేశం ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తున్నారు.. కానీ వారు ఆ ప్రాంతాల‌కే ప‌రిమితం అవుతున్నారు. షాపింగ్ చేయ‌డానికి సుముఖ‌త చూప‌డం లేద‌ని వ్యాపారులు తెలిపారు.

ప‌ర్యాట‌కుల‌కు సరైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డ‌మే

ఎందుకంంటే.. ప‌ర్యాట‌కుల‌కు సరైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డ‌మే. క‌నీసం ఏసీ బ‌స్సులు అందుబాటులో లేవు. మ‌దీనా నుంచి చార్మినార్ వ‌ర‌కు ఒక్క ఏసీ బ‌స్టాండ్ స‌దుపాయం కూడా లేదు. అంతేకాదు నిల‌బ‌డ‌డానికి కూడా నీడ లేదు. క‌నీసం కూర్చొని సేద తీర‌డానికి కూడా ఎలాంటి స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో ప‌ర్యాట‌కులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి షాపింగ్‌కు దూరంగా ఉంటూ ప‌ర్యాట‌క ప్రాంతాల‌కే ప‌రిమిత‌మ‌వుతూ వెళ్లిపోతున్నార‌ని వ్యాపార‌స్తులు తెలిపారు.

సాయంత్రం వేళ ట్రాఫిక్ స‌మ‌స్య‌లు..

ఒక వేళ సాయంత్రం పూట షాపింగ్ చేద్దామ‌నుకుంటే ట్రాఫిక్ స‌మ‌స్యలు త‌లెత్తుతున్నాయి. గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే వాహ‌నాల‌ను ఆపుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. పాత‌న‌గరాన్ని సంద‌ర్శించి షాపింగ్ చేయాలంటే ప‌ర్యాట‌కులు న‌ర‌కంగా భావిస్తున్నార‌ని ఓ దుకాణదారుడు పేర్కొన్నాడు.

ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వ్యాపారులు

ఇలా పాత‌బ‌స్తీ వ్యాపార‌స్తుల వ్యాపారం మంద‌గిచండంతో.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్టు వారు వాపోయారు. ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే.. కిరాయిలు, విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని బాధిత వ్యాపార‌స్తులు పేర్కొన్నారు.