Singer | ప్రేమ పేరుతో దారుణం.. అదృశ్యమైన పంజాబీ సింగర్ హత్య, కాలువలో లభ్యమైన మృతదేహం

Singer | ప్రేమ పేరుతో వేధింపులు, తిరస్కరిస్తే దాడులు, హత్యలు వంటి ఘటనలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యులే కాదు, ప్రముఖులు కూడా ఇలాంటి ఘటనలకు బలవుతున్నారు. తాజాగా ప్రముఖ పంజాబీ గాయని యశిందర్ కౌర్ (29) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

  • By: Sandeep |    movies |    Published on : May 20, 2026 8:39 AM IST
Singer | ప్రేమ పేరుతో దారుణం.. అదృశ్యమైన పంజాబీ సింగర్ హత్య, కాలువలో లభ్యమైన మృతదేహం

Singer | ప్రేమ పేరుతో వేధింపులు, తిరస్కరిస్తే దాడులు, హత్యలు వంటి ఘటనలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యులే కాదు, ప్రముఖులు కూడా ఇలాంటి ఘటనలకు బలవుతున్నారు. తాజాగా ప్రముఖ పంజాబీ గాయని యశిందర్ కౌర్ (29) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో “ఇందర్ కౌర్” పేరుతో మంచి గుర్తింపు పొందిన ఈ యువ గాయని అదృశ్యమైన కొన్ని రోజులకే మృతదేహంగా లభించడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, మే 13వ తేదీ రాత్రి యశిందర్ కౌర్ తన ఇంటి నుంచి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి కారులో బయలుదేరారు. అయితే చాలా సమయం గడిచినా తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో..

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మంగళవారం ఉదయం ఒక కాలువలో మహిళ మృతదేహం కనిపించిందన్న సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆ మృతదేహం యశిందర్ కౌర్‌దేనని నిర్ధారించారు. కాలువలో ఎక్కువసేపు ఉండటం వల్ల మృతదేహం గుర్తుపట్టలేని స్థితికి చేరినట్లు అధికారులు తెలిపారు.

ఘటనాస్థలానికి సమీపంలోనే ఆమె ప్రయాణించిన కారు కూడా గుర్తించారు. కారులో రక్తపు మరకలు కనిపించడంతో, ఆమెపై దాడి చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఇది పాత వ్యక్తిగత విభేదాలు, గత పరిచయాల కోణంలో జరిగిన నేరమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొన‌సాగుతున్న ద‌ర్యాప్తు..

ఈ కేసులో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడిపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే అంతర్జాతీయ న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటన పంజాబీ సినీ, సంగీత రంగాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతిభావంతమైన యువ గాయని అకాల మరణం పట్ల అభిమానులు, కళారంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.