Akhanda 2 |నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ–2 ప్రీమియర్ షోలకి రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్‌లో సందడి వాతావరణం కనిపించింది. రాత్రి 9 గంటలకే మొదలైన స్పెషల్ షోలతో తెలుగు రాష్ట్రాల థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాకినాడ–అనకాపల్లి జిల్లాల సరిహద్దులోని పాయకరావుపేట ఎస్ విసి థియేటర్ వద్ద అభిమానుల సందడి మరింత ఉత్సాహంగా కొనసాగింది. బాలకృష్ణకు అత్యంత ఆప్తుడిగా పేరుగాంచిన చింతకాయల రాంబాబు ప్రీమియర్ షోకు వచ్చిన ప్రతి అభిమానికి ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేస్తూ అభిమానుల్లో ఎనలేని ఆనందాన్ని నింపారు. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాగతిస్తూ, బాలయ్యపై తనకు ఉన్న ప్రేమను తనదైన శైలిలో వ్యక్తం చేశారు.
బాలయ్య ఫ్యాన్స్ హంగామా..
రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైన ప్రీమియర్ షో ఆశించిన స్థాయిలో అద్భుత స్పందన పొందింది. ‘అఖండ–2’లో బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆధ్యాత్మికత కలగలిపిన హిందూతత్వం అభిమానులను మరింత ఆకట్టుకోవడంతో థియేటర్ లోపల బయట ఒకే సందడి నెలకొంది. ఉదయం 7 గంటల షోకు కూడా భారీగా అభిమానులు హాజరయ్యారు. షో అయి బయటకు వచ్చిన వారందరికీ రాంబాబు కూల్ డ్రింక్స్ అందిస్తూ అభినందనలు అందుకున్నారు. బాణాసంచా, ఊరేగింపులు, పాలాభిషేకాలతో థియేటర్ ప్రాంగణం పండుగలా మార్చేశారు.
“ఇది అఖండ–2 కాదు… అఖండ తాండవం!” అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ సినిమాపై తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేసారు. ఏపీ వ్యాప్తంగా థియేటర్ల వద్ద బాలయ్య మేనియా స్పష్టంగా కనిపిస్తూ, అఖండ–2 అదరగొడుతుంది. పెయిడ్ ప్రీమియర్స్‌కు టికెట్ రేట్లు రూ. 600 వరకు ఉండటంతో కొంతమంది ఆలోచనలో పడ్డ, థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏ మాత్రం భారీ రేంజ్‌లోనే ఉంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో సినిమా కలెక్షన్లు భారీగా వచ్చినట్టు తెలుసతుంది. తాజా సమాచారం ప్రకారం, నైజాం ప్రీమియర్స్ లోనే సినిమా సుమారు రూ. 2.3 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
