Shivaji | నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతూ మరో వివాదానికి దారి తీస్తున్నాయి. ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు, నెటిజన్లు శివాజీపై తీవ్రంగా స్పందించారు. వివాదం చెలరేగిన గంటల వ్యవధిలోనే శివాజీ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పినా, ఆ తర్వాత తన మాటలపై నిలబడుతున్నానంటూ మరోసారి వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. శివాజీ చేసిన వ్యాఖ్యల్లోని పదజాలమే అభ్యంతరకరమని పలువురు విమర్శిస్తుండగా, మరో వర్గం మాత్రం ఆయన చెప్పాలనుకున్న భావం తప్పు కాదని సమర్థిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ వివాదం ఇప్పుడు ‘పెద్ది’ సినిమా వరకు చేరింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలోని ‘చికిరి చికిరి’ పాట లిరిక్స్‌పై కొత్త చర్చ మొదలైంది. ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, అది చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ పాటలో వినిపించే “సరుకు సామాను సూసి…” అనే లిరిక్స్‌ను ప్రస్తావిస్తూ, శివాజీ వ్యాఖ్యలు తప్పు అయితే ఈ పాటలోని పదజాలం కూడా తప్పే కదా అనే వాదన తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కరాటే కళ్యాణి బహిరంగంగా లేవనెత్తడంతో చర్చ మరింత ఊపందుకుంది. బిగ్‌బాస్ ఫ్యాన్ శేఖర్ భాషా కూడా ఇదే అంశంపై స్పందించారు. పెద్ద హీరో సినిమా పాటలో అదే పదం వినిపించినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, పైగా ఆ పాటకు రీల్స్ చేసి ఎంజాయ్ చేశారని ఆయన అన్నారు.
అదే పదాన్ని శివాజీ ఉపయోగిస్తే మాత్రం ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అందరూ ఒకేసారి దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అయితే శివాజీ వాడిన పదజాలం అభ్యంతరకరమేనని, అందుకే ఆయన క్షమాపణలు చెప్పారని కూడా శేఖర్ భాషా స్పష్టం చేశారు. మరోవైపు అనసూయ భరద్వాజ్, చిన్మయి, మంచు లక్ష్మి, పాయల్ రాజ్‌పుత్, రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ లాంటి పలువురు సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హీరోయిన్లు ఎలా దుస్తులు ధరించాలన్నది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని వారు స్పష్టం చేశారు. మొత్తానికి శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు పాటల లిరిక్స్, సినిమాల ప్రమోషన్స్ వరకు విస్తరించడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.
