Shivaji | ‘దండోరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించడంతో పాటు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో కూడా ఆయనపై కంప్లెయింట్ నమోదైంది. ఈ నేపథ్యంలో శివాజీ ఇప్పటికే ఒకసారి క్షమాపణలు కూడా తెలిపారు.తాజాగా ‘దండోరా’ చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ అంశంపై శివాజీ మరోసారి స్పందించారు. ఈవెంట్ అనంతరం తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని గ్రహించినట్లు తెలిపారు.
అయితే హీరోయిన్‌ల డ్రెస్సింగ్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు మాత్రం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పిన శివాజీ, ఆ సమయంలో రెండు అసభ్య పదాలు వాడినందుకు మాత్రం హృదయపూర్వకంగా క్షమాపణలు కోరారు. ఆ పదాలు ఎలా మాట్లాడానో ఇప్పటికీ తనకే అర్థం కావడం లేదని అన్నారు.“కర్మ ఎవరినీ వదిలిపెట్టదు” అంటూ భావోద్వేగంగా మాట్లాడిన శివాజీ, తన 30 ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడలేదని తెలిపారు. రాజకీయ జీవితంలో కూడా ఎవరినీ చిన్న మాట అనలేదని, ఆ రోజు ఎందుకు అలా మాట్లాడానా అని తనలో తానే బాధపడ్డానని చెప్పారు.
అయితే రెండు పదాల విషయంలో మహిళా కమిషన్ వరకూ వెళ్లడం అవసరమా? తనకంటే తీవ్రమైన పదాలు ఇండస్ట్రీలో మరెవ్వరూ వాడలేదా? అని శివాజీ ప్రశ్నించారు. ‘మంచి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పా?’ అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఆయన, ఆ స్టేట్‌మెంట్‌కు తాను కట్టుబడి ఉన్నానన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అనసూయ ఎందుకు వచ్చారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.శివాజీ వ్యాఖ్యలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న నేపథ్యంలో, ఆయన తాజా వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారి తీసే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
