Covid Alert | రూపు మార్చుకుంటున్న కొవిడ్‌.. చిన్న పిల్లలకు వేగంగా విస్తరణ

గతంలో కనిపించని లక్షణాలతో కొత్త వేరియంట్‌ కండ్లకలక, కళ్లలో చీదర కూడా కొవిడ్‌ లక్షణాలే చిన్న పిల్లలకు వేగంగా విస్తరించే అవకాశం దేశంలో గడిచిన 24 గంటల్లో 5,676 కేసుల నమోదు మరో 21 మందిని బలి తీసుకున్న మహమ్మారి దేశంలో క్రమంగా కొవిడ్‌ విస్తరిస్తున్నది. గతంకంటే వేగంగా సోకుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 5676 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిని కలుపుకొంటే యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం దేశంలో […]

  • Publish Date - April 11, 2023 / 11:01 AM IST

  • గతంలో కనిపించని లక్షణాలతో కొత్త వేరియంట్‌
  • కండ్లకలక, కళ్లలో చీదర కూడా కొవిడ్‌ లక్షణాలే
  • చిన్న పిల్లలకు వేగంగా విస్తరించే అవకాశం
  • దేశంలో గడిచిన 24 గంటల్లో 5,676 కేసుల నమోదు
  • మరో 21 మందిని బలి తీసుకున్న మహమ్మారి

దేశంలో క్రమంగా కొవిడ్‌ విస్తరిస్తున్నది. గతంకంటే వేగంగా సోకుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 5676 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిని కలుపుకొంటే యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం దేశంలో 37,093కు పెరిగాయి. 21 మంది చనిపోయారు. ఇదే ఆందోళనకర విషయం అనుకుంటే.. దేశంలో పెరుగుతున్న XBB.1.16 సబ్‌ వేరియంట్‌ విషయంలో లక్షణాలు కూడా కొత్త కొత్తవి కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ చిన్నపిల్లల హాస్పిటలైజేషన్‌ ఉంటున్నదని చెబుతున్నారు.

విధాత: ప్రస్తుతం భారతదేశంలో కొవిడ్‌ (Covid) కేసులు పెరగడానికి ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16 కారణమవుతున్నది. దీనిని ఆక్టూరస్‌ అని కూడా పిలుస్తున్నారు. కేసులు వేగంగా పెరగడమే కాకుండా.. కొత్త కొత్త లక్షణాలను కూడా గమనిస్తున్నామని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి గతంలో కనిపించలేదని అంటున్నారు. అన్నింటికి మించి ఆందోళన కలిగిస్తున్న అంశం.. చిన్నపిల్లలకు కొవిడ్‌ అధికంగా సోకుతుండటమని చెబుతున్నారు.

ఇవే కొత్త లక్షణాలు

దాదాపు ఆరు నెలల తర్వాత ఆస్పత్రుల్లోని చిన్నపిల్లల వార్డుల్లో చేరికలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక్కడ చేరుతున్నవారిలో ప్రధానంగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, వాపు ఉంటున్నాయని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ మాజీ కన్వీనర్‌, బిజ్నూర్‌లోని మంగ్ల హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ విపిన్‌ ఎం వశిష్ఠ చెబుతున్నారు.

వీటితోపాటు అనేక మంది కండ్లకలక, కండ్లకు బాగా పుసులు పట్టడం వంటి లక్షణాలతో ఉంటున్నారని, ఇది గతంలో ఎన్నడూ లేదని ఆయన తెలిపారు. గతంలో ఉన్న XBB.1.5 వేరియంట్‌తో పోల్చితే.. XBB.1.16 వేరియంట్‌ 140శాతం వేగంగా విస్తరించే లక్షణం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరింత దుందుడుకుగా ఈ వేరియంట్‌ ఉంటుందని చెబుతున్నారు.

ఈ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉంటాయా?

ఈ సబ్‌ వేరియంట్‌ గత కొన్ని నెలలుగా విస్తరిస్తున్నదని, అయితే.. ఇప్పటికైతే పరిస్థితి అంత సీరియస్‌గా ఏమీ లేదని గతవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి మారియా వాన్‌ కెర్‌ఖోవ్‌ చెప్పారు. కానీ.. మరింత ఎక్కువ మందికి సోకేలా ఉండటమే కాకుండా.. మరింత తీవ్రంగా మారే శక్తి ఈ వేరియంట్‌కు ఉండటమే ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. కనుక మనం మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ఆక్టూరస్‌గా పిలుస్తున్న XBB.1.16 సబ్‌ వేరియంట్‌.. గతంలో ఉన్న స్ట్రెయిన్స్‌ అన్నింటికన్నా చాలా భిన్నమైనది. ఇందులో E484K మ్యుటేషన్‌ అనేది టీకాలు వేసుకున్నవారినీ వదలదు. అంతేకాకుండా.. వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో అసంఖ్యాక పరివర్తనాలు ఉంటున్నాయి. దాని కారణంగా వైరస్‌ మానవ కణజాలంలోకి చాలా సులభంగా వెళ్లి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఇది చుట్టుపక్కల ఉన్నవారికి వేగంగా వ్యాపించే గుణం కూడా కలిగి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని అంటున్నారు. ఒమిక్రాన్‌తోపాటు ఇతర అన్ని వేరియంట్‌లకంటే అత్యంత వేగంగా ఆక్టూరస్‌ స్ట్రెయిన్‌ సోకుతుందని కొన్ని అధ్యయనాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉన్నదని నిపుణులు అంటున్నారు. వేరియంట్‌ ఎంత తీవ్రమైనది అయినప్పటికీ తప్పనిసరిగా ప్రమాదకారి అయి ఉంటుందని గానీ, తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందని గానీ భావించాల్సిన అవసరం లేదని స్పష్టంచేస్తున్నారు

Latest News