10 ఏండ్ల లోపు పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా..? అయితే ఈ ముప్పు త‌ప్ప‌ద‌ట‌..!

  • Publish Date - April 3, 2024 / 09:59 AM IST

ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా స్మార్ట్‌ఫోన్లే. ఎక్క‌డ చూసినా, ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే క‌నిపిస్తోంది. కూర‌గాయ‌ల నుంచి మొదలుకుంటే కోట్ల విలువ చేసే డైమండ్స్ దాకా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నాం. అంతేకాదు.. వీడియో గేమ్స్ నుంచి మొద‌లుకుంటే హాలీవుడ్ సినిమాల వ‌ర‌కు స్మార్ట్ ఫోన్‌లోనే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక పిల్ల‌లు కూడా ఈ స్మార్ట్ ఫోన్ల‌కు అల‌వాటు ప‌డిపోయారు. పెద్ద‌ల మాదిరిగానే పిల్ల‌లు కూడా నిత్యం స్మార్ట్ ఫోన్ల‌లో గ‌డిపేస్తున్నారు. అయితే 10 ఏండ్ల లోపు పిల్ల‌లు స్మార్ట్ ఫోన్ల‌కు బానిస‌లుగా మారితే.. ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ప‌దేండ్ల లోపు వ‌య‌సున్న పిల్ల‌ల‌కు మొబైల్స్ ఇవ్వ‌క‌పోవ‌డం మంచిద‌ని చెబుతున్నారు. పిల్ల‌ల ఆరోగ్యం త‌ల్లిదండ్రుల చేతుల్లోనే ఉంద‌ని సూచిస్తున్నారు.

10 ఏండ్ల లోపు పిల్ల‌లు ఎవ‌రైతే అధికంగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నారో వారిని అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతున్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. కంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ‌డం, శారీర‌కంగా ఎదుగుద‌ల లేక‌పోవ‌డం, వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు రావ‌డం వంటివి సంభ‌విస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. ఏడాది లోపు పిల్ల‌ల‌ను స్మార్ట్ ఫోన్ల‌కు దూరంగా ఉంచాల‌ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (WHO) హెచ్చ‌రిస్తోంది. రెండేండ్ల వ‌య‌సున్న పిల్లల‌కు గంట కంటే ఎక్కువ సేపు మొబైల్ ఇవ్వొద్ద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో నిబంధ‌న‌లు జారీచేసింది. ఐదేండ్ల‌లోపు పిల్ల‌లు గంట‌న్న‌ర కంటే ఎక్కువ చూడొద్ద‌ని పేర్కొంది.

నిత్యం ఫోన్ల‌లో మునిగి తేలే పిల్ల‌ల్లో అనేక జ‌బ్బులు వ‌స్తున్నాయ‌ని గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిట‌ల్‌కు చెందిన డాక్ట‌ర్ రాజీవ్ ఉత్త‌మ్ వెల్ల‌డించారు. డ‌యేరియా, ఫీవ‌ర్‌తో పాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. పిల్ల‌ల క‌ళ్ల‌పై స్మార్ట్ ఫోన్ స్క్రీన్లు తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌న్నారు. నిరంత‌రం ఫోన్లు చూడడం వ‌ల్ల దృష్టి లోపం కూడా ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. క‌ళ్లు పొడిబారి పోయి ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉంద‌న్నారు. క‌ళ్ల‌ల్లో దుర‌ద వ‌చ్చి, ఎర్ర‌గా మారే అవ‌కాశం ఉంటుంది. క‌ళ్ల‌ల్లో ఒత్తిడి కార‌ణంగా త‌ల‌నొప్పి రావ‌డం, నిద్ర‌కు భంగం క‌లిగే అవ‌కాశం ఉంది.

మ‌రి ముఖ్యంగా భోజ‌నం చేసే స‌మ‌యంలో పిల్ల‌ల‌ను స్మార్ట్ ఫోన్ల‌కు దూరంగా ఉంచాల‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చూస్తూ ఆహారం తిన‌డం వ‌ల్ల ఊబ‌కాయం సంభ‌వించే అవ‌కాశం ఉంది. బీపీ, షుగ‌ర్ రావొచ్చు. చిన్న పిల్ల‌ల్లో చివ‌రికి ప్రీ డ‌యాబెటిక్ రావ‌డానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు శారీర‌కంగా, మానసికంగా ఎద‌గాలంటే వారికి స్మార్ట్ ఫోన్లు దూరంగా ఉంచాల‌ని త‌ల్లిదండ్రుల‌కు డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.

Latest News