Premenstrual Symptoms | పీరియడ్స్ ముందు ఎందుకిలా అవుతుంది?

పీరియడ్స్ ముందు నొప్పి, మూడ్ స్వింగ్స్, ఇన్‌ఫెక్షన్లు సాధారణం. హార్మోనల్ మార్పులు, డైట్ & వ్యాయామంతో తగ్గించవచ్చు.

what-are-the-premenstrual-syndrome-symptoms-and-causes-all-details-in-telugu

ప్రతి నెలా పీరియడ్స్ సమయం దగ్గర పడుతున్నప్పుడు శరీరం ఒక ప్రత్యేక మార్పును ఎదుర్కొంటుంది. ఈ సమయంలో చాలామంది మహిళలు కాళ్లు లాగినట్టు నొప్పి, మైగ్రేన్, స్పాండిలోసిస్ పెయిన్, ఇన్‌ ఫెక్షన్లు, మూడ్ స్వింగ్స్, అలసట వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. కొందరికి గతంలో ఏవైనా దెబ్బలు తగిలి ఉంటే వాటి గాయాలు, తగ్గిన నొప్పులు కూడా మళ్లీ ఎక్కువ అవుతుంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు.. పీరియడ్స్ ముందు జరిగే హార్మోనల్ మార్పుల వల్లే ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.

హార్మోన్ల రోలర్ కోస్టర్

పీరియడ్స్ కు ముందు ప్రొజెస్టిరోన్ పెరగడం, ఈస్ట్రోజెన్ తగ్గడం జరుగుతుంది. ఈ హార్మోనల్ మార్పుల ప్రభావం శరీరంలోని అన్ని వ్యవస్థలపైనా పడుతుంది. నరాలు, మజిల్స్, జాయింట్లు, మూడ్, రక్తప్రసరణ.. అన్నీ ఈ మార్పులకు స్పందిస్తాయి.
ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు పెరగడంతో శరీరంలోని ఇన్‌ ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. దీంతో పాత గాయాలు, స్పాండిలోసిస్, మైగ్రేన్, మళ్లీ పెరిగిపోతాయి. కాళ్ల నొప్పులు ఉంటాయి.

• ఈస్ట్రోజెన్ డ్రాప్ వల్ల నరాలు సున్నితమవుతాయి. అందువల్ల నొప్పి పెరుగుతుంది.
• ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల కాళ్లు, కీళ్ళు బరువుగా అనిపిస్తాయి.
గాయాలు పెరిగేదెందుకు?
ఒకసారి మడమలో ట్విస్ట్ లేదా లిగమెంట్ ఇంజురీ జరిగినా, పీరియడ్స్ ముందు హార్మోన్ల ప్రభావంతో ఆ భాగం మళ్లీ సెన్సిటైజ్ అవుతుంది.
• శరీరంలో నీరు నిలవడం వల్ల వాపు రావొచ్చు.
• ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల లిగమెంట్లు వదులవుతాయి.
• రక్త ప్రసరణలో మార్పుల వల్ల ఆ భాగంలో ఇన్‌ ఫ్లమేషన్ మళ్లీ పెరుగుతుంది.
అందుకే తగ్గిపోయిన మడమల వంటి చోట నొప్పులు, మోకాళ్ల స్టిఫ్ నెస్, నడుము నొప్పి, వెన్నునొప్పులు పీరియడ్స్ ముందు మళ్లీ ఎక్కువ అవుతుంటాయి.

ఇన్‌ఫెక్షన్లు, వైట్ డిశ్చార్జ్ ఎందుకు పెరుగుతాయి?

పీరియడ్స్ ముందు వెజైనా దగ్గర పీహెచ్ లో మార్పు వస్తుంది. ఇమ్యూనిటీ తాత్కాలికంగా తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ భాగంలో ఉండే బాక్టీరియా బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఫలితంగా ఫంగల్ ఇన్ ఫెక్షన్లు, దురద, డిశ్చర్జ్ పెరుగుతాయి. అధిక చక్కెర తీసుకోవడం, సింథటిక్ ఇన్నర్‌ వేర్ వాడడం, హైజీన్ లోపం వంటివి సమస్యను మరింతగా పెంచుతాయి.
మైగ్రేన్, స్పాండిలోసిస్ కూడా…
ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల మెన్ స్ట్రువల్ మైగ్రేన్ మొదలవుతుంది. స్పాండిలోసిస్ ఉన్నవారికి జాయింట్స్, లిగమెంట్స్ అప్పటికే బలహీనంగా ఉంటాయి. దీనికి తోడు పీరియడ్స్ ముందు ప్రోస్టాగ్లాండిన్స్ పెరగడంతో ఇన్‌ ఫ్లమేషన్, మజిల్ స్టిఫ్ నెస్ ఎక్కువ అవుతుంది.
మూడ్ స్వింగ్స్ వెనుక కారణం
పీరియడ్స్ ముందు సెరొటొనిన్ లెవెల్స్ తగ్గడం వల్ల యాంగ్జయిటీ, ఇరిటబిలిటీ, బాధగా, దిగులుగా ఉండటం, ఏడవాలనిపించడం, మూడ్స్ లో పదే పదే మార్పులు రావడం సాధారణం. పీరియడ్స్ ముందు స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ కూడా పెరుగుతుంది. దాంతో శరీరం “హై అలర్ట్ విధానం”లోకి వెళ్తుంది.

ఎలా మేనేజ్ చేయాలి?

1. హార్మోన్ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం : గుమ్మడి, సన్ ఫ్లవర్, అవిసె గింజలు, నువ్వుల వంటివి తీసుకోవాలి. ఒమేగా 3 కోసం ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజల నూనె, వాల్ నట్స్ తినాలి. ఆకుకూరలు, బాదం, అరటి పండ్లు తీసుకుంటుంటే విటమిన్ బి6, మెగ్నీషియం లభిస్తాయి. ఇవి పీరియడ్స్ ముందు వచ్చే ప్రీ మెన్ స్ట్రువల్ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతాయి.
2. ఇన్‌ ఫ్లమేషన్ తగ్గించటానికి : రాత్రిపూట పసుపు, మిరియాల పొడి కలిపిన గోరువెచ్చని పాలు తాగాలి. ముందురోజు రాత్రి మెంతులు నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి. సాయంత్రం పూట కొబ్బరినీళ్లు తాగాలి.
3. కాళ్లు, జాయింట్ల నొప్పి : నొప్పి ఉన్నచోట రోజూ పది నిమిషాల పాటు కోల్డ్ ప్యాక్ పెట్టాలి. గోరువెచ్చని నువ్వుల నూనెతో మసాజ్ చేయాలి.
4. ఇన్‌ఫెక్షన్ల నివారణ : ఇమ్యూనిటీ ని బ్యాలెన్స్ చేసే ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు మంచివి. చక్కెర పదార్థాలు తగ్గించాలి. కాటన్ ఇన్నర్ వేర్ మాత్రమే వాడాలి.
5. మూడ్ స్వింగ్స్ తగ్గడానికి : డార్క్ చాక్లెట్, నట్స్, అరటి వంటివి మూడ్ బాగుండటానికి ఉల్లాసంగా ఉండటానికి సహాయపడుతాయి. సాయంకాలం 20 నిమిషాల పాటు వాకింగ్ కి వెళ్లండి. తులసి, హెర్బల్ టీ తీసుకోండి. ప్రాణాయామం హెల్ప్ చేస్తుంది.
6. స్పైన్ & మైగ్రేన్ కేర్ : నిద్ర సైకిల్ దెబ్బతినకుండా చూసుకోవాలి. రాత్రిపూట కెఫీన్ పదార్థాలను అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఒత్తిడికి గురవకుండా జాగ్రత్తపడాలి.
పీరియడ్స్ ముందు శరీరం ఇచ్చే ఈ సంకేతాలు బలహీనత కాదు, స్మార్ట్ అలర్ట్స్. పీరియడ్స్ ఒక శిక్ష కాదు, శరీరం నెలనెలా ఇచ్చే ఫీడ్ బ్యాక్ రిపోర్ట్. ఈ సమయంలో శరీరానికి మంచి పోషణ, రెస్ట్ ఇచ్చి, హీల్ కావడానికి, రిపేర్ అవడానికి అవకాశం ఇస్తే సమస్యలు తగ్గి, శరీరం మరింత బ్యాలెన్స్ డ్ గా పనిచేస్తుంది.

 

Exit mobile version