Real Estate Fraud: ప్రీ లాంచ్ పేరుతో రూ.300కోట్ల మోసం..నిందితుడి అరెస్టు

ప్రీ లాంచ్ పేరుతో రూ. 300 కోట్ల మోసానికి పాల్పడిన జయత్రి ఇన్‌ఫ్రా ఎండీ కాకర్ల శ్రీనివాస్ చౌదరిని ఈడీ అరెస్ట్ చేసింది. చెన్నైలో పట్టుబడిన నిందితుడిని హైదరాబాద్‌కు తరలించారు.

Jayatri Infrastructures

విధాత, హైదరాబాద్ : ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.300 కోట్లు మోసం చేసిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కాకర్ల శ్రీనివాస్ చౌదరిని ఎన్ ఫోర్స్ మెంట డైరక్టరేట్(ED) అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. డిసెంబర్ 31 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్ గుడా జైలుకు తరలించారు.  ఈడీ కేసు నమోదు కాగానే కాకర్ల శ్రీనివాస్ పరారీ అయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు చెన్నైలో అతడిని అరెస్టు చేశాయి.

హైదరాబాద్‌ శివారులోని గోపన్‌పల్లిలో తక్కువ ధరకు ప్లాట్లు ఇప్పిస్తాననిప్రీ లాంచ్ ఆఫర్ పేరిట ఇంటి కొనుగోలుదారుల నుంచి శ్రీనివాస్ డబ్బులు వసూలు చేశాడు. వారికి ఇళ్లు ఇవ్వకుండా, తిరిగి డబ్బులు ఇవ్వకుండా వందలాది మంది మధ్యతరగతి ప్రజలను శ్రీనివాస్ మోసం చేశాడు. ఇప్పటివరకు 300 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. జయత్రి కంపెనీ తమను ఆకర్షణీయమైన బ్రోచర్లు, ప్రీ లాంచ్‌ ఆఫర్లతో డిస్కౌంట్‌ ధరలకు ప్రైమ్‌ ప్లాట్లను ఇస్తామని నమ్మబలికిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరికి కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌ వద్ద100 మందికి పైగా ఉద్యోగులతో కూడిన విలాసవంతమైన కార్పొరేట్‌ కార్యాలయం చూపించడంతో పెద్ద సంస్థ అని నమ్మినట్లుగా బాధితులు తెలిపారు. రెండేళ్లలోపు ప్లాట్లను అప్పగిస్తామంటే రూ. 20 లక్షల నుంచి రూ.1.8 కోట్ల వరకు వివిధ దశల్లో చెల్లించామని చెబుతున్నారు. గడువు ముగిసినా వివిధ రకాల సాకులు చూపిస్తూ ఇళ్లు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని తెలిపారు.

గతంలోనూ మరో మోసం

ప్రధాన నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌, మరో 19 మంది డైరెక్టర్లతో కలిసి ఫిబ్రవరి 2021లో జయత్రి గ్రూప్‌ను స్థాపించినట్లుగా సమాచారం. గతంలో హిల్టన్‌ జయ డైమండ్‌ పేరుతో భారీ వెంచర్‌ను ప్రారంభించి మోసానికి పాల్పడ్డాడని..అదే సంస్థకు చెందిన శ్రీనివాస్‌తో పాటు మరికొందరు అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. ఇదే సంస్థ గతంలో రాజమండ్రిలో ఇలాంటి మోసానికే పాల్పడిందని బాధితులు తెలిపారు. తమకు జరిగిన మోసంపై వారు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి :

AP Universities Act amendment | ఆంధ్రాలో ఒకే గొడుగు కిందకు అన్నీ వర్సిటీలు..  ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1941కు సవరణలు
Maoist Surrender : తెలంగాణలో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

Latest News