AP Universities Act amendment | ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రకాల యూనివర్సిటీలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకే విధమైన పరిపాలన, విద్యాపరమైన నాణ్యత, ఆర్థిక వనరులను సమకూర్చేందుకు యూనివర్సిటీ చట్టంలో మార్పులు తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1941 లో సవరణలు తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అధికారులతో కమిటీని నియమించారు. ఆ కమిటీ తన నివేదికను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారని సమాచారం.
ఆంధ్రాలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే యూనివర్సిటీలు 32 ఉన్నాయి. ఇందులో 24 యూనివర్సిటీలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకమైన నిబంధనలు, అకడమిక్ బాధ్యతలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), శ్రీ పద్మావతి విమెన్స్ యూనివర్సిటీ, ద్రావిడియన్ యూనివర్సిటీ, జెఎన్టీయూ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకురానున్నారు. ఉన్నత విద్యలో పరిపాలనతో పాటు బోధన, పాఠ్యాంశాలలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఆర్జీయూకేటీ మినహా అన్ని విశ్వ విద్యాలయాలకు రాష్ట్ర గవర్నర్ చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్జీయూకేటీ ప్రత్యేక చట్టంతో ఏర్పాటు కావడంతో ప్రభుత్వమే చాన్స్‌లర్‌ను నియమిస్తున్నది.
ప్రస్తుతం అన్ని యూనివర్సిటీలలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (పాలక మండలి)ను ప్రభుత్వం విద్యా, సాంకేతిక ప్రముఖులతో నియమిస్తున్నది. ఈ సంప్రదాయం కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్నది. మారిన పరిస్థితులు, ఉన్నత విద్యలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏర్పాటు చేయనున్నారు. పరిపాలన, విద్యా బోధన, ఆర్థిక వనరులపై బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ విధాన పరమైన నిర్ణయాలు తీసుకోనున్నది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, న్యాయ నిపుణులైన వర్గాల నుంచి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను ఎంపిక చేయనున్నారు.
అలాగే ప్రతి యూనివర్సిటీలో అకాడమిక్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం రెండు సార్లు సమావేశం అయి విద్యా సంబంధిత విషయాలలో నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలకు అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు వీలుగా విద్యా బోధన, పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నారు. వైస్ చాన్స్‌లర్ వయో పరిమితిని కూడా 65 సంవత్సరాలకు పరిమితం చేయనున్నారు. ప్రస్తుత చట్టంలో వయో పరిమితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైస్ చాన్స్‌లర్ పదవికి ఎంపికైన వారు మూడు సంవత్సరాల పాటు పదవిలో ఉండనున్నారు. వైస్ చాన్స్‌లర్ పదవి ఎంపిక కోసం ఏర్పాటు చేసే సెర్చ్ కమిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. అన్ని యూనివర్సిటీలలో నియామకాల కోసం యూనివర్సిటీ నియామక బోర్డు ఏర్పాటు కానున్నది. ఈ బోర్డు బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపడుతుంది. వైస్ చాన్స్‌లర్ అక్రమాలు, అవినీతి పనులకు పాల్పడినట్లు విచారణలో తేలితే సస్పెండ్ చేసే అధికారం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1941 సవరణ బిల్లులో పొందుపర్చారు.
ఇవి కూడా చదవండి..
Maoist Surrender : తెలంగాణలో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
Harish Rao : పేద విద్యార్థిని వైద్య విద్య ఫీజు కోసం..సొంత ఇంటిని తనఖా పెట్టిన హరీష్ రావు
Python Attack Zoo Keeper : జూ కీపర్ పై కొండ చిలువ దాడి.. వీడియో వైరల్
