విధాత : పేద విద్యార్థిని పీజీ వైద్యవిద్య చదువుకు రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని తనఖా(మార్టిగేజ్) పెట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఔదార్యం వైరల్ గా మారింది. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కొంక రామచంద్రం దంపతులకు నలుగురు బిడ్డలు. వారిలో పెద్ద కూతురు మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. ఇటీవల పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో మమతకు ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినప్పటికి.. ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50 లక్షలు..మూడేళ్లకు రూ.22.50లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం పేర్కొంది. ట్యూషన్ ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడంతో మమత తండ్రి.. ఆ డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఈనెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి ఏర్పడింది.
తన పీజీ వైద్య విద్య కోసం మమత బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకర్స్ తెలిపారు. ఇంతకుముందే ఇంటిపై లోన్ తీసుకుని ఉండటం..మరే ఆస్తుల లేకపోవడంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితిని మమతకు ఎదురైంది. ఈ పరిణామాల క్రమంలో మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రంలు సమస్యను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
మమత పరిస్థితిని అర్ధం చేసుకున్న హరీష్ రావు వెంటనే స్పందించి సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూ కేషన్ లోన్ మంజూరు చేయించారు. తను స్వయంగా చొరవ తీసుకోవడంతో మూడు రోజుల్లోనే బ్యాంకు లోన్ మంజూరైంది. అలాగే విద్యార్ధి మమతకు హాస్టల్ ఫీజు కోసం లక్ష రూపాయలు అందించారు. పేద విద్యార్ధిని మమత పీజీ వైద్య విద్య కోసం హరీష్ రావు స్పందించిన తీరుపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మమత ఎంబీబీఎస్ చదువు కోసం హరీశ్‌రావునే సాయం చేశారు. అంతేకాకుండా ఆమె ముగ్గురు తోబుట్టువుల ఎంబీబీఎస్ చదువు కోసం కూడా హరీశ్‌రావునే సాయం చేయడం గమనార్హం. తమ చదువులకు సహకరించిన హరీష్ రావు కు మమత కుటుంబం కృతజ్ఞలు తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Komatireddy Rajagopal Reddy : త్వరలోనే నాకు మంత్రి పదవి రాబోతుంది
TATA Sierra vs MG Hector : టాటా సియెర్రాకు ఎంజీ హెక్టార్ కౌంటర్ ఇచ్చేనా..!
