Hyderabad Dasara Celebrations | విజయదశమి సంబరాలు: దేవాలయాల్లో వాహన పూజ సందడి

హైదరాబాద్‌ నగరం విజయదశమి ఉత్సాహంతో కిటకిటలాడింది. దేవాలయాల్లో వాహనపూజ కోసం వాహనాల రద్దీ, జాంబాగ్‌, గుడిమల్కాపూర్‌ మార్కెట్లలో పూలు,పండ్లు, పూజా సామగ్రి కోసం జనం తాకిడి కనిపించింది.

Hyderabad Temples Witness Heavy Rush for Vehicle Puja Ahead of Vijayadasami

Hyderabad Temples Witness Heavy Rush for Vehicle Puja Ahead of Vijayadasami

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (విధాత):

Hyderabad Dasara Celebrations | నగరం అంతా విజయదశమి ఉత్సాహంతో కిక్కిరిసిపోయింది. గురువారం దసరా సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తమ వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించుకుని శాంతి, సంపదలు కోరుకున్నారు. ఒకవైపు దేవాలయాల్లో దసరా ఉత్సవాలు జోరుగా సాగుతుంటే, మరోవైపు బతుకమ్మ పండుగ వాతావరణంతో నిన్న నగరమంతా అలరారింది.

ఆలయాలు, మండపాల్లో కిక్కిరిసిన భక్తులు

ఉదయం నుంచే నగరంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. వాహనాలకు పసుపు, కుంకుమ రాసి, అరటి ఆకులు, పూలతో అలంకరించి ఆలయాలకు తరలివచ్చారు. ఈ రోజు సాధనాలు, ఆయుధాలు, వాహనాలు, పుస్తకాలకు పూజ చేయడం ద్వారా దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పూజ ప్రత్యేకంగా జరుగుతుంది. ఆలయ పూజారులు వాహనాలకు ప్రత్యేక మంత్రోచ్చారణలతో పూజలు చేసి, యజమానులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆర్టీసీ బస్సులనూ పూలతో, అరటి ఆకులతో అలంకరించారు. పెద్ద ఎత్తున వాహన పూజలు జరగుతుండడంతో ఆలయాల చుట్టుపక్కల ట్రాఫిక్ కూడా భారీగా కనిపించింది.

మార్కెట్లు, మాల్స్‌లో పండుగ సందడి

జాంబాగ్‌, గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్లు పూల కోసం కొనుగోలుదారులతో నిండిపోయాయి. విజదశమి పూజలకు అవసరమైన ఆకులు, పూలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ వంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు జనం పోటెత్తారు. దసరా పండుగకు జమ్మిఆకు ప్రత్యేకం కావడంతో దానికి విపరీతమైన గిరాకీ కనిపించింది.  బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, బేగంపేట, అమీర్‌పేట్‌, మోండా మార్కెట్‌లలోనూ ఇదే హడావిడి కనిపించింది. మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్సులు కూడా పండుగ వెలుగులతో మెరిసిపోయాయి. విద్యుత్‌ దీపాలతో, పూల మాలాలంకారాలతో షాపింగ్‌ వాతావరణం పండుగ సందడితో సాగుతోంది.

దుర్గా మండపాలు, అన్నదానంతో సందడి

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని దుర్గా మండపాలు, ఆలయ కమిటీలు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. బెంగాలీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, పెద్ద ఎత్తున భక్తులు లైన్‌లో నిలబడి దుర్గా మాత ఆశీర్వాదాలు పొందారు. నగరమంతా పండుగ వాతావరణంతో ఉత్సాహంగా ఉండి, విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకునే సందడి కనిపించింది. కుటుంబసభ్యులు, స్నేహితులు ఒకేచోట చేరి దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ఏర్పాట్లు చేసుకున్నారు.

Exit mobile version