విధాత, హైదారాబాద్ : అడవిలో ఉండాల్సిన కొండ చిలువ జనారణ్యంలోని ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడింది. బాచుపల్లి లోని రెడ్డి ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులోకి ఎలా వచ్చిందో గాని..కిటికి నుంచి ఓ గదిలో దూరింది. అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న వారు ఆ కొండ చిలువను గమనించి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. వారు చాకచక్యంగా ఈ భారీ కొండ చిలువను బంధించారు. అనంతరం దానిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సంఘటనతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీనది వరద నగరంలోని పలు ప్రాంతాల్లో పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాములు, కొండచిలువలు, మొసళ్లు జనావాసాల్లోకి ప్రవేశించి, భయాందోళనకు గురి చేస్తున్నాయి. నది పరివాహక ప్రాంత ప్రజలకు మొసళ్లు, కొండచిలువలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే వరదలకు దూరంగా ఉన్న అపార్ట్మెంట్ రెండవ అంతస్తు వరకు ఆ కొండ చిలువ ఎలా చేరిందనేది అర్థం కావడం లేదు. పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులు దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నారు.