విధాత: దాదాపు 30 సంవత్సరాలు భద్రపరిచిన పిండం ఇప్పుడు శిశువుగా పురుడుపోసుకుంది. ఇన్నేళ్లపాటు భద్రపరిచిన పిండం శిశువుగా మారిన సంఘటనలేవీ ఇప్పటివరకూ లేవని, ఇది ప్రపంచ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. సైన్స్ సినిమాను తలపించేలా ఉన్న ఈ కథ ఏంటంటే..అమెరికాకు చెందిన లిండా ఆర్చర్డ్ అనే మహిళకు సహజసిద్ధంగా సంతానం కలగకపోవడంతో 1994లో ఐవీఎఫ్ విధానం వైపు మొగ్గుచూపారు. దీనికోసం డాక్టర్లు ఆమె అండాలు, ఆమె భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చేయించి నాలుగు పిండాలను వృద్ధి చేశారు. ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఆడ సంతానాన్ని పొందారు.
మిగిలిన మూడు పిండాలను ఆమె భద్రపరిచారు. ఆ తర్వాత తన భర్త నుంచి విడిపోయినప్పటికీ ఆ పిండాలను లిండా ఆర్చర్డ్ వదులుకోలేదు. వాటిని రీసెర్చ్ లేదా గుర్తు తెలియని కుటుంబానికి దానమివ్వడం ఆమెకు ఇష్టం లేదు. ఆ పిండాలను భద్రపరిచేందుకు ఆమె ప్రతి ఏటా వేలాది డాలర్లను చెల్లించారు. తర్వాత ఒక క్రిస్టియన్ పిండ దత్తత కేంద్రం వాటి బాధ్యతను స్వీకరించింది. అయితే అమెరికాలోనే ఉండే వివాహిత, శ్వేతజాతి క్రిస్టియన్ జంటకు ఆ పిండాలను ఇవ్వాలని లిండా నిర్దేశించారు.
అక్కడ సీన్ కట్ చేస్తే అమెరికాలోని ఒహాయోకు చెందిన లిండ్సే,టిమ్ పియర్స్ జంట సంతానం కోసం ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. వారి ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో లిండా ఆర్చర్డ్ పిండాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో లిండా ఆర్చర్డ్‌కు సంబంధించిన రెండు పిండాలను లిండ్సే గర్భంలోకి ప్రవేశ పెట్టారు. అందులో ఒకటి శిశువుగా వృద్ధి చెంది మగ శిశువుగా పురుడు పోసుకుంది. దీంతో లిండ్సే దంపతులు సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉందని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అయితే లిండా ఆర్చర్డ్‌కు ఇప్పుడు 62 సంవత్సరాలు. ఆమె కుమార్తెకు 30 ఏళ్లు.. 1994లో భద్రపరిచిన తన పిండం ఇప్పుడు మగ సంతానంగా మారిన ఫొటోను చూసి ఆమె ఎంతగానో సంతోషపడ్డారు.