Polio Case | ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం మధ్య 25 సంవత్సరాల తర్వాత తొలిసారిగా గాజాలో పోలియో కేసు నమోదైంది. జోర్డాన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో టీకాలు వేయని పది నెలల బాలుడికి పోలియో పాజిటివ్‌గా తేలింది. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం.. వేలాది మంది పిల్లలకు టీకాలు వేసేందుకు ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధాన్ని నిలిపివేయాలని యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలియో కేసును గుర్తించారు. గాజాలో 25 సంవత్సరాలుగా ఒక్క పోలియో కేసు నమోదు కాలేదు.
తాజాగా నమోదైన పోలియో కేసు పొరుగు దేశాలకు సైతం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో 10 నెలల చిన్నారికి అవసరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలియో పాజిటివ్‌గా తేలిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా యుద్ధంలో 6.40లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయడానికి గుటెర్రెస్ యుద్ధానికి విరామం ఇవ్వాలని పిలుపునిచ్చిన అనంతరం ఈ కేసును గుర్తించారు. ఈ నెలలో ప్రారంభమయ్యే పాలస్తీనా భూభాగంలోని పిల్లలను చేరుకోవడానికి వివరణాత్మక ప్రణాళికలు రూపొందించినట్లు యూఎన్, ఆరోగ్య సంస్థలు తెలిపాయి. అయితే, దీనికి ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య 10 నెలల సుదీర్ఘ యుద్ధాన్ని ఆపడం అవసరం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ ఆగస్టు చివరి నుంచి గాజా స్ట్రిప్‌లో టైప్ – 2 పోలియోవైరస్ (cVDPV2)కి వ్యతిరేకంగా టీకాలు వేయాలని నిర్ణయించింది.
పోలియోపై పోరాటంలో పిల్లలు, కుటుంబాలు సురక్షితంగా పోలియో టీకా కేంద్రాలకు చేరుకునేందుకు యుద్ధం ఆపాలని.. అలాగే, కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యకర్తలు పోలియో టీకా కోసం ఆరోగ్య కేంద్రాలను చేరుకోలేని పిల్లలను చేరుకుంటాయని ఏజెన్సీలు తెలిపాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఐరాస చీఫ్ గుటెర్రెస్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీయో వ్యాప్తిని అరికట్టేందుకు సమగ్ర, సమన్వయ, తక్షణ కృషి అవసరమన్నారు. కార్యక్రమానికి మానవతా దృక్పథంతో విరామం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.