విధాత : ఇంటింటా దీపాలు..బాణసంచా పేలుళ్లు..నోములు, వ్రతాలతో సందడిగా జరుపుకునే భారతీయుల సంబరాల పండుగ దీపావళి(Diwali Festival)కి అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యూనెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్(Intangible Cultural Heritage) జాబితా( UNESCO)లో దీపావళి పండుగకు చోటు సంపాదించింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యూనెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటన చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన షెకావత్, ఇది భారతీయులకు ఇది భావోద్వేగ అంశమన్నారు. కుండలు చేసే వారి నుంచి కళాకారులు వరకు అనేక మంది ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. యూనెస్కో గుర్తింపు రావడం ఒక బాధ్యత అని, మనమందరం కచ్చితంగా ముందు తరాలకు అందించాలని పేర్కొన్నారు. దీపావళి అంటే రామరాజ్యానికి, సుపరిపాలనకు సంబంధించినదని పిల్లలకు తెలియాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. యూనెస్కో 20వ సదస్సు ఈనెల 13 వరకూ దిల్లీలోని ఎర్రకోటలో కొనసాగుతుంది. యూనెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్‌లో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. యూనెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వందల మంది వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు.
యూనెస్కో జాబితాలో ఇప్పటిదాక భారత్‌కు చెందిన 15 సాంస్కృతిక, వారసత్వ ప్రదర్శనలు, పండుగలు గుర్తింపు పొందాయి. వాటిలో కుంభమేళా, కోల్‌కతా దుర్గాపూజ, గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్‌లీల వంటివి ఉన్నాయి. ఆయా సాంస్కృతిక, వారసత్వ వేడుకలను రక్షించుకోవాల్సి ఉందని యూనెస్కో ప్రతినిధులు వెల్లడించారు. దీపావళి పండుగను యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చడాన్ని భారత్ స్వాగతించింది. భారతదేశంలోని ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇది ఉత్సాహాన్ని కలిగించే విషయమని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
ఇటీవల శతాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వంటకాల వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. లఖ్‌నవూను యూ నెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా యూనెస్కో ప్రకటించింది.
