Flash Floods : భారీ వర్షాలు, వరదలతో అఫ్ఘానిస్థాన్ అతలాకుతలమవుతోంది. వరదల బీభత్సంతో గత మూడు రోజుల్లోనే అక్కడ 33 మంది మరణించార. మరో 27 మంది గాయపడ్డారు. అదేవిధంగా 600కు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 పశువులు చనిపోయాయి. అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫరా, హెరాత్, కాబూల్, కాందహార్ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు.
అఫ్ఘానిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. వరదల కారణంగా లోతట్టు్ ప్రాంతాల్లోని నివాసాలు, పశువుల కొట్టాలు కూలిపోయి, కొట్టుకుపోయి ప్రాణ నష్టం సంభవిస్తోంది. పశువులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి.
టాంజానియాలో 58 మంది మృతి
తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాను కూడా భారీ వర్షాలు, వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తు్న్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా గత రెండు వారాల్లో 58 మంది మృతిచెందారు. తీర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. అంతేగాక 1.26 లక్షల మందికి పైగా ప్రజలు ఆవాసాలు కోల్పోయారు. కాగా తరచూ వరదలు అతలాకుతలం చేస్తుండటంతో భవిష్యత్తులో వరదలను నివారించేందుకు కొత్తగా 14 డ్యామ్‌లను నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు టాంజానియా ప్రభుత్వం పేర్కొన్నది.