Site icon vidhaatha

హ‌మాస్‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిన టెస్లా కారు.. 100 తూటాలు త‌గిలినా తగ్గేదేలె

విధాత‌: ఎదురుగా సుమారు 12 మంది హ‌మాస్ సాయుధులు.. కారులోంచి దిగితే స‌జీవంగా ప‌ట్టుకుని చిత్ర హింస‌లు పెట్టి చంపేస్తారు. కారులోనే ఉంటే తుపాకీ తూటాల‌తో కారును తూట్లు పొడిచేస్తారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్న ఓ ఇజ్రాయెల్ పౌరుణ్ని టెస్లా కారు (Tesla Car) కాపాడింది. ద‌క్షిణ ఇజ్రాయెల్‌ (Israel) లోని కిబ్బుత్ మెఫాల్‌సిం అనే న‌గ‌రంలోకి సాయుధులైన హ‌మాస్ ద‌ళాలు చొచ్చుకొచ్చి క‌న‌ప‌డిన వారిని క‌న‌ప‌డిన‌ట్లు కాల్చుతున్న సంద‌ర్భంలో ఈ ఘ‌టన చోటు చేసుకుంది. న‌గ‌రానికి చెందిన ఒక వ్య‌క్తి త‌న టెస్లా మోడల్ 3 కారులో ప్ర‌యాణిస్తూ ఉండ‌గా.. అప్ప‌టికే అత‌డిని గ‌మ‌నిస్తున్న 12 మంది సాయుధులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దిగేసి పారిపోడానికి ప్ర‌య‌త్నించినా దొరికి పోతామ‌ని భావించి.. అత‌డు కారులోనే ఉండిపోయాడు.


అయితే ఆ కారు విద్యుత్ బ్యాట‌రీల‌ద‌ని తెలియ‌క‌పోవ‌డంతో ఉగ్ర‌వాదులు ఇంధ‌న ట్యాంకుల‌పై విచ్చ‌ల‌విడి కాల్పులు చేశాయి. ఇంజిన్‌ను పేల్చేస్తే ఇంధ‌నం అంటుకుని భారీ పేలుడు సంభ‌విస్తుంద‌నే కార‌ణంతో వారు ఆ ప్ర‌య‌త్నం చేశారు. అయితే విద్యుత్ కార్ల‌కు అక్క‌డ ఏమీ ఉండ‌దు కాబ‌ట్టి ఆ కాల్పులు పెద్ద‌గా న‌ష్టం చేయ‌లేదు. వారి ద‌గ్గ‌ర ఉన్న కాలాషింకోవోస్‌, మెషీన్ గ‌న్‌ల‌తో కారు చ‌క్రాల‌ను కూడా కాల్చేశారు. అయితే టెస్లా కున్న డ్యూయ‌ల్ డ్రైవ‌ర్ సిస్టం, యాక్స‌ల‌రేష‌న్ కార‌ణంగా అత‌డు అక్క‌డ నుంచి త‌ప్పించుకున్నాడు. డ్యూయ‌ల్ డ్రైవ‌ర్ సిస్టం ఉండ‌టం వ‌ల్ల టైర్లు ఫ్లాట్ అయినా వాహ‌నం మామూలుగానే న‌డుస్తుంది. వేగం కూడా ఏమీ త‌గ్గ‌దు.


దీంతో బాధితుడు 170 కి.మీ. వేగంతో అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు. తీవ్ర‌గాయాల పాలైన అత‌ణ్ని రెస్క్యూ ద‌ళాలు ర‌క్షించి ఆసుప‌త్రిలో చేర్చాయి. ప్ర‌స్తుతం అక్క‌డ చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. 530 హార్స్ ప‌వ‌ర్ ఇంజిన్‌తో ఉన్న టెస్లాతో ఉగ్ర‌వాదుల టొయాటా ట్ర‌క్కులు పోటీ ప‌డ‌లేక‌పోయాయ‌ని బాధితుడు పేర్కొన్నాడు. సుమారు 100 బుల్లెట్లు త‌గిలినా.. ముందు భాగం మొత్తం నాశ‌న‌మైపోయినా ఆ టెస్లా కారు ఇంకా ర‌న్నింగ్‌లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. టెస్లా కారు వ‌ల్ల ఒక‌రి ప్రాణం పోకుండా బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డార‌ని తెలుసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ఎలాన్ మ‌స్క్ పేర్కొన్నారు.

Exit mobile version