Site icon vidhaatha

మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసు.. తెలుగువారిపై అభియోగాల‌ను ఉప‌సంహ‌రించుకున్న ప్రిన్స్‌ట‌న్ పోలీసులు

అమెరికాలోని టెక్సాస్‌లో మాన‌వ‌ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు వ్యక్తులపై ఉన్న అభియోగాలను ప్రిన్స్‌టన్ పోలీసులు ఉపసంహరించుకున్నారు. సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలేలకు లేబర్ ట్రాఫికింగ్ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని పోలీసులు స్ప‌ష్టం చేశారు. మార్చి 2024లో లేబర్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో ఈ న‌లుగురు భాగమని ప్రిన్స్‌ట‌న్ పోలీసులు ఆరోపణలు చేశారు.

ప్రిన్స్‌టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సార్జెంట్ సి.క్రాఫోర్డ్ కొల్లిన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్‌కి అందుకు సంబందించిన లేఖ పంపారు. నలుగురు తెలుగు వ్య‌క్తుల‌పై మోపిన అభియోగాలు నిజం కాదని ఆ లేఖలో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. లేఖలో ప్రత్యేకంగా జనవరి 8, 2024 నుంచి మార్చి 13, 2024 మధ్య చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, చందన్ దాసిరెడ్డి పంపిన వివరణలో “ 2019లో యూఎస్ఏలోని టెక్సాస్‌లో ఐటీ కన్సల్టింగ్ కంపెనీని స్థాపించారు. అందులో భాగంగా ఆపరేషన్స్, నిర్వహణలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. కంపెనీ గ్రాడ్యుయేట్లు, అనుభవజ్ఞులైన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, వారికి అమెరికాలో ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులు ఐటీ కన్సల్టింగ్ కంపెనీని సంప్రదిస్తారు. మొదట ఇంటర్వ్యూ చేస్తారు. ఆ తర్వాత వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వ్యక్తులకు కఠినమైన శిక్షణను ఇస్తారు. ఆ తర్వాత ఐటీ కంపెనీలకు ఇంటర్వ్యూలకు పంపుతారు” స్పష్టం చేశారు.

“శిక్షణా కాలంలో, కంపెనీ సదరు అభ్యర్థులకు వారి నైపుణ్యం ప్రకారం జీతం చెల్లిస్తుంది. ఆ కాలంలో అభ్యర్థులకు సరైన ఆదాయం లేనందున, కంపెనీ వసతి, ఆహారం, ఇతర ప్రాథమిక అవసరాలను అందిస్తుంది. అభ్యర్థులకు ఇమ్మిగ్రేషన్, H1B ప్రక్రియ, వీసా కూడా కంపెనీ చూసుకుంటుంది. అభ్యర్థి ఉద్యోగం పొందిన తర్వాత, జీతం కంపెనీకి జమ చేస్తారు. జీతంలో 80 శాతం నుంచి 90 శాతం వ‌ర‌కు అభ్యర్థికి ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని అందించిన సేవల నిమిత్తం కంపెనీ తన వద్ద ఉంచుకుంటుంది. ప్రస్తుతం కంపెనీలో సుమారు 1500 మంది వ్యక్తులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారు, ఇందులో 700 మంది వ్యక్తులు ఉద్యోగాలు పొందారు. మిగిలిన 800 మంది శిక్షణ పొందుతున్నారు” అని తెలిపారు.

“తమ కన్సల్టింగ్ కంపెనీ యూఎస్ఏలోని పేరొందిన ఐటీ కంపెనీలతో కలిసి పని చేస్తుంది. ఆయా కంపెనీలకు కావాల్సిన ఉద్యోగాలకు సరైన అభ్యర్థులను అందించడంలో వారికి సహాయం చేస్తుంది. మార్కెట్‌లోని అత్యుత్తమ కన్సల్టింగ్ సంస్థలలో ఒకటిగా పేర్కొన్న ఐటి కంపెనీలలో కంపెనీ మంచి గుర్తింపు, పేరును పొందింది. యూఎస్ఏలోని ఐటీ నిపుణులలో చోటు దక్కించుకునేలా మంచి శిక్షణను అందించడం, ఉద్యోగ అవసరానికి అనుగుణంగా నైపుణ్యాన్ని మెరుగుపరచడం కూడా ఇందులో భాగమే.” అని తెలిపారు.

“ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది భారతీయులు, అప్పుడే గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు తమ కుటుంబాలని విడిచిపెట్టి, విదేశంలో జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అభ్యర్థులు యూఎస్ఏలో వారి విద్య, ఇత్తర ఖర్చులను చెల్లించడానికి వివిధ రుణాలను పొందుతారు. వారి చదువు ముగిసే సమయానికి ఆర్థిక వనరులను పూర్తిగా కోల్పోతారు. ఉద్యోగం లేకుండా అక్కడ నివసించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల నుండి ఉద్యోగాలను పొందడంలో విఫలమైన వ్యక్తులు అమెరికాలో జీవించ‌డానికి చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు, వారికి ఎటువంటి ఆదాయం ఉండదు. సరైన వసతి, ఆహారం కూడా దొరకడం కష్టం. నా క్లయింట్లకు సంబంధించిన సంస్థ ఈ వ్యక్తులకు ఆశ్రయం, ఆహారం, ఇతర ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా వారికి సహాయం చేస్తుంది. వారికి స్థిరమైన ఆదాయం దక్కడానికి, స్వతంత్రంగా ఎదిగాలంటే ఉద్యోగాలను సాధించేలా శిక్షణనిస్తుంది.” అని వివరించారు.

“అమెరికాలోని ప్రిన్స్‌టన్‌లో, కంపెనీలో నమోదు చేసుకున్న 15 మంది అమ్మాయిలకు కంపెనీ గెస్ట్ హౌస్‌లో వసతి కల్పించామని స్పష్టం చేశారు. ఆ ఇంటి బాగోగులు సంతోష్ కట్కూరి చూసుకుంటూ ఉంటారు. 2024 మార్చిలో, సాధారణ నెలవారీ క్లీనింగ్‌లో భాగంగా సంతోష్ ఇంటిని శుభ్రం చేయడానికి, తెగుళ్లను, పురుగులు, కీటకాలను నివారించడానికి పెస్ట్ కంట్రోల్ సేవలను బుక్ చేశాడు. అభ్యర్థులకు పరిశుభ్రమైన ప్రదేశాన్ని, జీవించడానికి అనువుగా ఉండే ప్రాంతాన్ని అందించాలానే ఉద్దేశ్యంతో సంతోష్ ఈ పని చేశారు. పెస్ట్ కంట్రోల్ సేవల నుండి ఇంటికి వచ్చిన వ్యక్తి, ఒకే ఇంట్లో 15 మంది అమ్మాయిలను చూసినప్పుడు, పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. మానవ అక్రమ రవాణా జరుగుతోందని భావించి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు కొట్టడం ప్రారంభించగా, లోపల ఉన్న అభ్యర్థులు భయాందోళనకు గురయ్యారు. ఎవరో చోరీకి ప్రయత్నిస్తున్నారని భావించి ఇంట్లోని వివిధ ప్రదేశాలలో అమ్మాయిలు దాక్కున్నారు. అభ్యర్థుల్లో ఒకరు సహాయం కోసం పోలీసులను కూడా పిలిచారు. కొన్ని నిమిషాల తర్వాత అదే పోలీసులు వెనుక డోర్ నుండి లోపలికి ప్రవేశించారు. అభ్యర్థులు తమకు సహాయం చేయడానికి పోలీసులు వచ్చారని భావించి, దాగి ఉన్న ప్రదేశాల నుండి బయటకు వచ్చారు. దీంతో అభ్యర్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అభ్యర్థులను విచారించారు. ఈ సమయంలో వారు ఎటువంటి మానవ అక్రమ రవాణా చేయలేదని, కన్సల్టెన్సీ కార్యక్రమంలో భాగంగా మాత్రమే అక్కడ నివసిస్తున్నారని పోలీసులకు స్పష్టంగా తెలియజేశారు. విచారణ సమయంలో అభ్యర్థుల్లో ఒకరు సంతోష్‌కు కాల్ చేసి పిలిచారు. అతను వెంటనే అభ్యర్థులకు సహాయం చేయడానికి ఇంటికి చేరుకున్నాడు. సంతోష్ నిజంగా చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడినట్లయితే, అతను వెంటనే పరారీలో ఉండేవాడు, పిలిచిన వెంటనే ఇంటికి వెళ్ళేవాడు కాదు. దీంతో పోలీసులు సంతోష్‌ను విచారించి అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు సంతోష్ ఇంటిపై దాడి చేసి అతని భార్య ద్వారకా గుండను కూడా అరెస్టు చేశారు, ఆమె కూడా బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసి కేవలం మానవ అక్రమ రవాణాపై అనుమానాలున్నాయని చెప్పారు.

సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, చందన్ దాసిరెడ్డి మాట్లాడుతూ.. “మేము యూఎస్ఏలోని విద్యార్థులు, నిపుణులకు శిక్షణ, ఉద్యోగాలను అందించే కన్సల్టింగ్ కంపెనీ నిర్వహణలో భాగంగా ఉన్నాము. ఈ సంస్థ 5 సంవత్సరాల నుండి చట్ట పరిధిలోనే విధులు నిర్వర్తిస్తూ ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన చరిత్ర లేదు. కన్సల్టింగ్ కార్యక్రమంలో భాగంగా, అభ్యర్థులకు వసతి, ఇతర ప్రాథమిక అవసరాలు తీర్చాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కంపెనీ ఏర్పాటు చేసిన అలాంటి వసతి గృహంలో అభ్యర్థులు బస చేయగా, పోలీసులు పరిస్థితిని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని, మానవ అక్రమ రవాణాగా అనుమానించారు. పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మానవ అక్రమ రవాణా అని తమకు అనుమానం ఉందని మాత్రమే చెప్పారు. పోలీసులు ఎటువంటి ధ్రువీకరణ ఇస్తూ ప్రకటన చేయలేదు. పోలీసులు చేసిన ఆరోపణలు రుజువు చేయడానికి పోలీసుల వద్ద ఎటువంటి ఆధారాలు లేవు, కాబట్టి వారు అనుమానం ఉందని మాత్రమే చెప్పారు. ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.” అని స్పష్టం చేశారు.

 

Exit mobile version