Site icon vidhaatha

వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో జెలన్స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై మాస్కో చర్య
ముందు అరెస్టు చేయాల్సింది పుతిన్‌నే
రష్యా నిర్ణయంపై ఉక్రెయిన్‌ ఆగ్రహం

మాస్కో : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదీమిర్‌ జెలెన్స్కీని వాంటెండ్‌ క్రిమినల్స్‌ జాబితాలో రష్యా చేర్చింది. ఉక్రెయిన్‌ భూభాగంలోకి రష్యా దళాలు చొరబడి, యుద్ధం చేస్తున్న రెండేళ్ల అనంతరం మాస్కో అధికారులు ఈ ప్రకటన చేశారు. జెలెన్స్కీ పేరు యుద్ధానికి ముందటి ఫొటోతో రష్యా అంతర్గత మంత్రిత్వ శాఖ డాటాబేస్‌లో వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో చూపిస్తున్నదని రష్యా అధికార వార్తా సంస్థ టాస్‌ తెలిపింది.

అంతకు మించి వివరాలేవీ తెలియదని టాస్‌ తెలిపింది. ఇది రష్యా పనికిమాలిన ప్రకటన అని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. వాస్తవానికి ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు వారెంటుతో ముందుగా రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్‌ పుతిన్‌నే అరెస్టు చేయాల్సి ఉన్నదంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

రష్యా ఎంతటి నిరాశలో ఉన్నదో ఈ ప్రకటన తెలియజేస్తున్నదని పేర్కొన్నది. అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఈ పని చేసిందని విమర్శించింది. ఉక్రెయిన్‌ లాండ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ ఒలెక్సాండర్‌ పావులియుక్‌, ఉక్రెయిన్‌ మాజీ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో పేర్లు కూడా శనివారం రష్యా డాటాబేస్‌లో దర్శనమించాయి.

రష్యా వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో గతంలోనూ విదేశీ రాజకీయ నాయకుల పేర్లు చోటు చేసుకున్నాయి. సోవియట్‌ కాలం నాటి చిహ్నాలను నాశనం చేయడం ద్వారా చారిత్రక జ్ఞాపకాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎస్తోనియా ప్రధాని కాజా కల్లాస్‌ పేరును వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో రష్యా పెట్టింది

Exit mobile version