న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక తనదైన విలక్షణ నిర్ణయాలతో అమెరికన్లతో పాటు ప్రపంచాన్ని విస్మయ పరుస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేశాల మధ్య యుద్దాలను ఆపుతున్నానంటూ..అందుకు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూనే..ఇంకోవైపు ప్రపంచ దేశాలపై అధిక సుంకాల విధింపుతో వాణిజ్య యుద్దానికి తెరతీసి విదేశాలకు షాక్ ఇచ్చారు. ఇటు అమెరికాలో వరుస షట్ డౌన్లు వంటి నిర్ణయాలతో స్వదేశీయులను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. ట్రంప్ తాజాగా అమెరికన్లకు ఊరట నిచ్చే ఓ నిర్ణయంతో వారిని అశ్చర్యపరిచారు. దేశంలోని సంపన్నులు మినహా అందరి(American Citizens)కీ 2 వేల డాలర్లు($2000 payment) చెల్లిస్తామని ప్రకటించడం దేశ ప్రజలను విస్మయపరిచింది. ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో దేశానికి భారీ ఆదాయం సమకూరుతోందని, ఆ విధంగా వచ్చిన డబ్బును దేశ పౌరులకు డివిడెండ్(Tariff dividend) కింద పంచాలని నిర్ణయించామని..ఇందులో భాగంగా ఒక్కో అమెరికన్‌కు కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తామని ట్రంప్ ప్రకటించారు.
సుంకాల విధింపును వ్యతిరేకించేవారు మూర్ఖులు
అమెరికా సుంకాల పెంపుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు అని..అమెరికా ఇప్పుడు ప్రపంచంలేనే అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశం అని ట్రంప్ చెప్పుకొచ్చారు. దేశంలో ద్రవ్యోల్బణం దాదాపు లేదని.. రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని, లక్షల డాలర్లు వస్తున్నాయని… త్వరలోనే 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం అని ట్రంప్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో దేశానికి సమకూరుతున్న ఆదాయం నుంచి దేశ వాసులలో అధిక ఆదాయం ఉన్న వారిని మినహాయించి మిగతా వారికి డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తాం అని ట్రంప్ తెలిపారు.
సుప్రీంకోర్టు తీరుపై ట్రంప్ ఆగ్రహం
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకిస్తూ..సుంకాల విధింపులో అమెరికా అధ్యక్షుడి అధికారాలను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఆ దేశ సుప్రీంకోర్టు అధ్యక్షుడి అధికారాలపై ప్రశ్నలు లేవనెత్తడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపేసేందుకు, లైసెన్స్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారం ఉందని.. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశాలపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా..? అని ట్రంప్ ప్రశ్నించారు. సుంకాల విధింపు ప్రక్రియలో దేశాధ్యక్షుడి అధికారాలపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా అనిపిస్తోందని ట్రంప్ అసహనం వెళ్లగక్కారు. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వేయకూడదు..? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయని..దేశానికి ఆదాయం పెరుగుతుందని.ఇదంతా సుప్రీం కోర్టుకు తెలియదా? అసలేం జరుగుతోంది..? అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. .
