తుపాకీతోనే ఎంఆర్ఐ యంత్రంలో స్కానింగ్

సాధార‌ణంగా ఎంఆర్ఐ స్కాన్ మిష‌న్లు బ‌ల‌మైన అయ‌స్కాంత ఆక‌ర్ష‌ణ శ‌క్తి క‌లిగి ఉంటాయి. అందుకే అక్క‌డికి వెళ్లిన పేషెంట్‌ల వ‌ద్ద ఉన్న లోహ‌పు వ‌స్తువుల‌ను తీసి లోప‌లికి వెళ్ల‌మని వైద్యులు హెచ్చ‌రిస్తుంటారు

  • Publish Date - December 9, 2023 / 02:30 PM IST

– గన్ పేలి మహిళకు తీవ్ర గాయాలు

– అమెరికాలో ఘటన

సాధార‌ణంగా ఎంఆర్ఐ స్కాన్ మిష‌న్లు బ‌ల‌మైన అయ‌స్కాంత ఆక‌ర్ష‌ణ శ‌క్తి క‌లిగి ఉంటాయి. అందుకే అక్క‌డికి వెళ్లిన పేషెంట్‌ల వ‌ద్ద ఉన్న లోహ‌పు వ‌స్తువుల‌ను తీసి లోప‌లికి వెళ్ల‌మని వైద్యులు హెచ్చ‌రిస్తుంటారు. అయితే అమెరికాలో ఓ మహిళ మాత్రం త‌న‌తో పాటు లోడ్ చేసిన గ‌న్ తీసుకువెళ్లింది. దీంతో అది కాస్త పేలడంతో త‌న ప్రాణాల‌మీద‌కు తెచ్చుకున్న‌ది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వివ‌రాల ప్ర‌కారం, 57 ఏళ్ల మహిళ స్కానింగ్ కోసం వెళ్ల‌గా, త‌న‌ వద్ద ఉన్న ఎయిర్ గన్.. ఎమ్మారై స్కానింగ్ మిషన్ అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనై దాని ట్రిగ్గర్ అనుకోకుండా టచ్ అయ్యింది. వెంటనే గన్ పేలింది. దీంతో ఆమె వెనుక భాగంలోని తొడలపై తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మారై గదిలోకి పేషెంట్ హ్యాండ్ గన్ ను దాచిపెట్టి తీసుకువచ్చిందని, మిషన్ బోర్ లోకి ప్రవేశించే సమయంలో చేతిలోని తుపాకీ అయస్కాంతానికి ఆకర్షితమై ఒక రౌండ్ కాల్పులు జరిగాయని ఎఫ్ డీఏ వెల్ల‌డించింది. ఈ ఘటనలో రోగి సబ్కటానియస్ కణజాలం దెబ్బతిన్న‌దని, ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుందని తెలిపింది. సదరు మహిళ ఎమ్మారై గదిలోకి ఆయుధాన్ని ఎలా తీసుకురాగలిగిందనేది ఇంకా తెలియ‌లేదు. గతంలో కూడా ఇలాగే ఆసుపత్రిలో ఓ మహిళకు ఎమ్మారై మిషన్ వల్ల తీవ్ర గాయాలయ్యాయి. బ్రెజిల్ లో ఏకంగా ఓ వ్యక్తి దగ్గర ఉన్న గన్ ఫైర్ అయ్యి మృతి చెందాడు.