విధాత: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani),వ్యాపార సంస్థల్లో ఈడీ సోదా(ED Raids) లు చేపట్టింది. ఏక కాలంలో ఢిల్లీ, ముంబైల్లోని కంపెనీల లావాదేవీలను ఈడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 2017 నుండి 2019 మధ్య యెస్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ. 3,000 కోట్లకు పైగా రుణాల అక్రమ మళ్లింపుపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈడీ దాడులకు దిగడం గమనార్హం.
రిలయన్స్ కమ్యూకేషన్స్‌తో పాటు ఆ సంస్థ ప్రమోటర్-డైరెక్టర్ అనిల్ అంబానీని ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ ‘మోసగాడిగా ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకులు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికి పథకం మేరకు యస్ బ్యాంక్ ప్రమోటర్లు తమ స్వంత గ్రూప్ సంస్థలకు రుణ మంజూరీకి ముందుగానే నిధులు పంపినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. కొన్ని కంపెనీలకు రుణాలు దరఖాస్తు చేసిన రోజునే విడుదలయ్యాయని.. అధికారిక ఆమోదాలకు ముందే డబ్బుల బదిలీ జరిగిందని గుర్తించామని.. పాత రుణాలను తిరిగి చెల్లించేందుకు కొత్త రుణాలు మంజూరు చేసినట్టు ఆధారాలు లభించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
సెబీ నివేదిక ప్రకారం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా మంజూరైన కార్పొరేట్ రుణాలు 2017-18ఆర్థిక సంవత్సరం రూ.3,742 కోట్ల నుండి 2019లో రూ. 8,670 కోట్లకు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందని..ఈ రుణ లావాదేవీలపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎస్ బీఐ సైతం అనిల్ అంబానీ సంస్థల మోసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ఫిర్యాదు చేయబోతోందని ఇటీవల ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో చెప్పడం విశేషం.